గుంతల్లో నీరు.. 30 రోజులైనా స్పందన లేదు.. బీజేపీ ఫైర్‌!

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా గుండ్లపల్లి – పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గన్నేరువరం (Ganneruvaram) మండల అధ్యక్షుడు తిప్పర్తి నీకేష్ ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు వినూత్న నిరసన (BJP Protest) చేపట్టారు. గన్నేరువరం మండల కేంద్రం నుండి గుండ్లపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీటితో నిండిన పెద్ద పెద్ద గుంతల్లో కాగితపు పడవలు వదులుతూ, వర్షపు నీటిలోనే కూర్చొని ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

​30 రోజులైనా స్పందన లేదంటూ ఆగ్రహం

ఈ సందర్భంగా తిప్పర్తి నీకేష్ మాట్లాడుతూ.. అధ్వానంగా తయారైన గుండ్లపల్లి – పొత్తూరు రోడ్డు వల్ల నిత్యం వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగష్టు 10వ తేదీన రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి 30 రోజులు గడిచినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం శోచనీయమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలకుల వైఖరిని నిరసిస్తూనే ఈ కాగితపు పడవల కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

స్పందించకపోతే ఉద్యమం ఉధృతం

ఇక, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి తక్షణమే డబుల్ రోడ్డు పనులను పునఃప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ను సైతం ముట్టడించడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>