కలం, వెబ్ డెస్క్ : కొలంబియాలోని (Colombia) విల్లావిసెన్సియో నగరంలో కారు బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. నగర కేంద్రంలో అనుమానిత పేలుడు సంభవించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో కనీసం 12 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో మెటా గవర్నర్ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పేలుడు ధాటికి సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి భద్రతా సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడుకు కారణాలు, ఘటన వెనుక ఎవరున్నారనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నగర కేంద్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

