కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు 27,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మోటార్లును ఎందుకు ప్రారంభించడం లేదో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టులో ఇప్పటికే 7.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుందని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారన్నారు.
అయినా పాలమూరు రైతుకు నీళ్లు అందించకుండా, ఆ నీటిని శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడుకు వెళ్లేలా చేయడానికే పంపులను ఆన్ చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. వరదొచ్చినప్పుడు నీటిని ఎత్తిపోయకుండా కిందికి జార విడుస్తుందని ఆరోపించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యమా? అంటూ నిలదీశారు.
తక్షణమే భీమా-1లోని భూత్పూర్ (1.3 టీఎంసీ), సంగంబండ (3.3 టీఎంసీ), భీమా-2లోని శంకర సముద్రం (1.8 టీఎంసీ), రంగసముద్రం (1.9 టీఎంసీ), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గూడెందొడ్డి (1.2 టీఎంసీ), ర్యాలంపాడు (4 టీఎంసీ), అలాగే కోయిల్‌సాగర్ (1.5 టీఎంసీ) రిజర్వాయర్లను నింపేందుకు వెంటనే మోటార్లను ప్రారంభించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జూరాల ఎడమ, కుడి కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

