కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) నగరంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఆషాఢ మాసపు ముందస్తు బోనాల (Bonalu) వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తులలో ముస్తాబై తలపై బోనం ఎత్తుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు పోతురాజుల వేషధారణలో ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణం పూలతోరణాలు, మామిడి ఆకులతో అందంగా అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, గట్టు శ్రీనివాస్‌తో పాటు ఆచార్యుల బృందం పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

