కలం, ములుగు: ఉత్తర తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం బొగత జలపాతం (Bogatha Waterfall) ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణ నయాగరాగా పేరొందిన ఈ జలపాతం ప్రస్తుతం భారీ వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో భారీగా వరద నీరు జలపాతానికి చేరుతోంది.
కనువిందు చేస్తూనే భయాందోళనలు..
సుమారు 160 మీటర్ల వెడల్పుతో, 50 అడుగుల ఎత్తు నుంచి తెల్లని పాలధారలా జాలువారుతున్న జలపాతం కనువిందు చేస్తూనే భయాందోళనలు కలిగిస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం నీటి ప్రవాహం పలుమార్లు పెరగడంతో జలపాతం పరిసర ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. జలపాతం నుంచి ఎగిసిపడుతున్న నీటి తుంపర్లు దూరం వరకు వ్యాపిస్తూ ఆ ప్రాంతమంతా మబ్బులతో కమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది.
జలపాతం వద్ద నో ఎంట్రీ..
భారీ వరద ఉధృతి కారణంగా పర్యాటకుల భద్రత కోసం ఏర్పాటు చేసిన రక్షణ వలయం, వాకింగ్ కారిడార్ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. జలపాతానికి సమీపంలోని వీక్షణ ప్రాంతాలు కూడా వరద నీటితో నిండిపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ జలపాతం వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రమాద ప్రాంతాల్లోకి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఉధృతి మరింత పెరిగే అవకాశం..
భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో జలపాతం వద్ద వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వరద తగ్గే వరకు బొగత జలపాతాన్ని (Bogatha Waterfall) సందర్శించేందుకు ప్రయత్నించవద్దని, సెల్ఫీల కోసం లేదా నీటి ప్రవాహానికి దగ్గరగా వెళ్లి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని పర్యాటకులకు సూచించారు. ఇదిలా ఉండగా, భారీ వరదతో బొగత జలపాతం సరికొత్త అందాలను సంతరించుకోవడంతో దూరం నుంచే ఈ ప్రకృతి వైభవాన్ని వీక్షించేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. అయితే భద్రతే ప్రధానమని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
పరవళ్లు తొక్కుతున్న ‘చింతలమాదర’
అటు భారీ వర్షాలతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం చింతలమాదర జలపాతం (Chinthalamadara Waterfall) పరవళ్లు తొక్కుతోంది. వరదనీరు పెరగటంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో జలపాతం సీజనల్ అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. దీంతో జలపాతం వద్ద పర్యాటకుల సందడి పెరిగింది.
హోరెత్తుతున్న బొగత, చింతలమాదర జలపాతాలు
-ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న “తెలంగాణ నయాగరా ‘బొగత’
-అలాగే కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలో పొంగుతున్న చింతలమాదర జలపాతం
-జలపాతాల వద్ద పర్యాటకుల సందడి
Heavy Rains Revive… pic.twitter.com/KJma8Cbxwg— Kalam Daily (@kalamtelugu) July 29, 2026
Read Also: జెన్ జీ.. వయా ఇన్స్టా.. మోదీ నయా ప్లాన్!
Follow Us On: X(Twitter)

