కలం, నిజామాబాద్ బ్యూరో: రానున్న ఎన్నికల్లో బీజేపీ సునామీ ఖాయమని నిజామాబాద్ ఎంపీ అరవింద్( MP Arvind) ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సునామీలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు కొట్టుకుపోతాయని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు బీజేపీ రుచి తెలంగాణకు చూపిస్తామని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో రెండు పార్టీలు తప్పు చేశాయని అన్నారు. కాళేశ్వరం డ్యామ్ డిజైన్, లొకేషన్ తప్పు అని పేర్కొన్నారు. కాళేశ్వరానికి కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్లు చేయకపోవడం దారుణమని విమర్శించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణను రాజకీయాలకు వాడుకున్నాయని రుజువైందని వ్యాఖ్యానించారు. శ్రీకాంతా చారి కుటుంబంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలను రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని అరవింద్( MP Arvind) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్నడూ కూడా జై తెలంగాణ అనలేదని దుయ్యబట్టారు. రాష్ట్రం వచ్చే వరకు రేవంత్రెడ్డి ఏ రోజు తెలంగాణ కోసం మాట్లాడలేదని గుర్తు చేశారు.
తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడిండు కానీ కుటుంబానికి పదవులు ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాణమిత్రుడు ఉత్తమ్ కుమార్ను గెలిపించేందుకు ఆనాడు శంకరమ్మను బలి చేశారని వేలెత్తి చూపారు. కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిన కేసీఆర్.. శంకరమ్మకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
Also Read : ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్డ్ గన్ ఉండాలి: ఎమ్మెల్యే రాజా సింగ్
Follow Us On: Youtube

