కలం, కరీంనగర్ బ్యూరో : భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ గన్నేరువరం (Ganneruvaram) మండల ప్రజలు రహదారి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గన్నేరువరం పెద్దచెరువు మత్తడి ఉధృతంగా ప్రవహిస్తే రాకపోకలు పూర్తిగా ప్రమాదకరంగా మారుతున్నాయి. గతంలో ఇద్దరు యువకులు వరద నీటిలో కొట్టుకుపోగా స్థానికులు, జాలర్లు, పోలీసులు వారిని కాపాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్తడిపై వంతెన నిర్మించడంతో పాటు గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు పనులను పూర్తి చేయాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు.
మత్తడి వద్ద తప్పని ముప్పు
గన్నేరువరం (Ganneruvaram) పెద్దచెరువు మత్తడి పొంగిన ప్రతిసారీ వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ఆ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా మారుతోంది. మత్తడిపై శాశ్వత వంతెన నిర్మించాలని మండల ప్రజలు చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో పాటు పలుచోట్ల కల్వర్టులు లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని చెబుతున్నారు.
రోడ్డు పనులపై బీజేపీ నిరసన
గుండ్లపల్లి స్టేజి వద్ద డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ నాయకత్వంలో జరిగిన ఆందోళనలో కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు.
ఈ సందర్భంగా తిప్పర్తి నికేష్ మాట్లాడుతూ.. గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం గతంలో యువజన సంఘాలు చేసిన పోరాటాన్ని కవ్వంపల్లి సత్యనారాయణ రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. రోడ్డు నిర్మాణం పేరుతో ప్రజల నుంచి మద్దతు పొందిన తర్వాత సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.70 కోట్లు మంజూరైనప్పటికీ పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదని పేర్కొన్నారు.
పనులు ప్రారంభించకపోతే ముట్టడి
గుంతలు, కంకర కుప్పలు, ప్రమాదకర ప్రాంతాలతో గుండ్లపల్లి–గన్నేరువరం మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని బీజేపీ నాయకులు అన్నారు. వర్షాలు కురిసినప్పుడు రహదారిపై నుంచి వరద ప్రవహించడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని తెలిపారు. రాత్రివేళ ఈ మార్గంలో ప్రయాణించే పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు.
రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో డబుల్ రోడ్డు పనులు ప్రారంభించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పాటు ప్రజాప్రతినిధుల పట్టింపులేని వైఖరి కారణంగానే సమస్య కొనసాగుతోందని ఆరోపించారు. కల్వర్టుల వద్ద తాత్కాలిక మరమ్మతులు కూడా ప్రజల రాకపోకల కంటే భారీ వాహనాల రాకపోకలకు అనుకూలంగా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయని తెలిపారు.
Also Read : ఇథనాల్‌తో బీజేపీ ఎంపీ ప్రయోగం.. ఏం తేలిందంటే!
Follow Us On: Sharechat

