కలం, వెబ్ డెస్క్ : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఉప్పు నిప్పులా ఉండే నాయకులు తెల్లవారితే అలాయ్ బలాయ్ చేసుకోవడం రాజకీయాల్లో సహజం. ఇలాంటి ఘటనే సిద్ధిపేట (Siddipet) కేంద్రంగా ఆవిష్కృతమైంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించారు.
సిద్దిపేట జిల్లాలోని ఓ అభివృద్ధి కార్యక్రమంలో వీరిద్దరు కలిసి పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, రెండు పార్టీలకు చెందిన నేతలు తమ ప్రాంత అభివృద్ధి కోసం కలిసి పనిచేయడం.. పనులు ప్రారంభించడం అనేకసార్లు చూసుంటాం. కానీ, సిద్దిపేటలో మాత్రం రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు ఒకే కారులో రావడం ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

