రుక్మాపూర్ వక్ఫ్ బాధితులకు అండగా నిలవాలి: బీజేపీ కిసాన్ మోర్చా

కలం, కరీంనగర్: చొప్పదండి మండలం రుక్మాపూర్ (Rukmapur) గ్రామంలోని సర్వే నెంబర్ 18 పరిధిలోని 4 ఎకరాల నివాస స్థలాలు, గృహాలను ఎలాంటి ప్రాతిపదిక లేకుండా వక్ఫ్ బోర్డు ఖాతాలో నమోదు చేయడం దుర్మార్గమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాగంపేట మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి (Singireddy Krishnareddy) తీవ్రంగా మండిపడ్డారు. మండల బీజేపీ అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకుల బృందం ఆదివారం రుక్మాపూర్ గ్రామాన్ని సందర్శించి, వక్ఫ్ నమోదుతో తీవ్ర ఆందోళనలో ఉన్న బాధితులను పరామర్శించారు.

దశాబ్దాలుగా ఇక్కడే..

​ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ… సుమారు 60 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన అన్నంరాజు కుటుంబీకుల వద్ద దళిత, బహుజన వర్గాలకు చెందిన దాదాపు 40 మంది గ్రామస్తులు సర్వే నెంబర్ 18లోని 4 ఎకరాల భూమిని రిజిస్టర్డ్ సేల్ డీడ్ల ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. గ్రామ పంచాయతీ అనుమతులతో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యాలు పొంది, ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా ఇక్కడే నివాసముంటున్నారని వివరించారు. ఖాస్రా పహాణీ నుంచి ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చేంతవరకు రికార్డుల్లోని పట్టా, కబ్జా కాలమ్‌లలో బాధితుల పేర్లే స్పష్టంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

​వక్ఫ్ ఖాతాలో ఎలా చేర్చారో చెప్పాలి..

ఏ ఆధారాలు లేకున్నా 2020లో రెవెన్యూ అధికారులు అకస్మాత్తుగా ఈ భూమిని వక్ఫ్ బోర్డు ఖాతాలో ఎలా చేర్చారో సమాధానం చెప్పాలని కృష్ణారెడ్డి నిలదీశారు. తక్షణమే సర్వే నెంబర్ 18ని వక్ఫ్ బోర్డు రికార్డుల నుంచి తొలగించి, నివాసితులకు తిరిగి పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని, చొప్పదండి మండల హిందూ సమాజం కూడా బాధితులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాండ్ల సతీష్, తోట కోటేశ్, ఎడ్ల సురేష్, దొంతీసారపు సంపత్, పెద్ది వీరేశం, ఓర్గల తిరుపతితో పాటు బాధితులు బియ్యాల వెంకటేష్, సందనవేని కొమురయ్య, దాడి మల్లయ్య, దాడి కొమురయ్య, లంకా చంద్రమౌళి, దాసరి చంద్రశేఖర్, మెండే మహేందర్, బొమ్మిడి వినయ్, కొండ మల్లేశం, సందనవేణి బక్కయ్య, ముద్దం చందు, కాదాసి అఖిల్, పాలకుర్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>