కలం, కరీంనగర్: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా (BJP Kisan Morcha) రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోగా, గతంలో అమల్లో ఉన్న రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ అన్నదాతలను మోసం చేస్తోందని విమర్శించారు. కరీంనగర్ పట్టణంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మోతే గంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ కిసాన్ మోర్చా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా బస్వ లక్ష్మీ నర్సయ్య (Baswa Laxmi Narsaiah) మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోగా, ఉన్న రైతు బీమాను సైతం ఎత్తివేయడం ద్వారా రైతులకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సంబంధం లేని వ్యవసాయ భూములను నిషేధిత జాబితా (22A)లో చేర్చి రైతులను రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రోజుకు ఎన్ని గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారో ట్రాన్స్‌ఫార్మర్ల వారీగా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని లక్ష్మీ నర్సయ్య సవాల్ విసిరారు. నిత్యం విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుంటే, మరోవైపు వందలాది వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండటమే రేవంత్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, రుణమాఫీ, 22ఏ భూముల సమస్య, యూరియా కొరత, విద్యుత్ కోతలు, రైతు బీమా, రైతు బంధు ఇలా ప్రతి విషయంలోనూ అన్నదాతలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో గట్టిగా నిలదీయాలని, రైతులకు బాసటగా నిలబడాలని కిసాన్ మోర్చా శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, నూతుల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అన్నాడి జలపతి రెడ్డి, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గంగుల కొమురెల్లి, రైతు నాయకులు, మాజీ ఎంపీపీ దొంగల రాములు, పుప్పాల రఘు, జాడి బాల్‌రెడ్డి, దొంతిసారపు సంపత్, పుల్లెల జగన్, చింతలపల్లి శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, బుర్ర శ్రీనివాస్, ఎడ్ల సురేష్, గుండె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

