కలం, భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt), సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ (BRS) పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొడతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) స్పష్టం చేశారు. టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా తనను నియమించినందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఎంపీ ప్రియాంక గాంధీ, పవన్ ఖేరా, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కేవలం సోషల్ మీడియాకే పరిమితమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి అంశాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ఆ పార్టీ చూస్తోందని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను మర్చిపోలేదని, అందుకే వరుస ఎన్నికలలో ఆ పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెప్పారని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావులు నీటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
గోదావరి, బనకచర్ల అంశాలలో కేంద్రం వెనక్కి తగ్గడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల కృషి ఉందని ఎంపీ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఒకటేనంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేటీఆర్, హరీశ్ రావుల లక్ష్యం ప్రభుత్వంపై బురద చల్లడమేనని, ప్రజలకు ఇబ్బందులు వస్తే రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం సరికాదని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు వ్యతిరేకం కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో బీఆర్ఎస్ విఫలమైందని, పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న అసత్య ప్రచారాలను కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి తిప్పికొట్టాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

