కలం, భువనగిరి : యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలోని అరోరా కళాశాల(Aurora College) బాలికల హాస్టల్‌లో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. విద్యార్థినుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా హాస్టల్ సిబ్బంది వ్యవహరించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. హాస్టల్‌లో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులు వెల్లడించిన విషయాలు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వాట్సాప్ చాట్‌లు, ఓ విద్యార్థి తన తండ్రితో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో రికార్డింగ్ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాయి.
భువనగిరి పట్టణంలోని అరోరా కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో మెస్ ఇంచార్జీగా పనిచేస్తున్న పృథ్వీ, వార్డెన్ రేవతికి సంబంధించిన వాట్సాప్ చాట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా, కళాశాలలో జరుగుతున్న అక్రమాలు, సిబ్బంది తీరుపై ఓ విద్యార్థి తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతున్న ఆడియో రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు కావాలంటే చెప్పాలని మెస్ ఇంచార్జీ పృథ్వీ కొందరితో మాట్లాడినట్లు ఆ ఆడియోలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, వార్డెన్ రేవతి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఇతర కాల్స్ ద్వారా విద్యార్థులకు చూపిస్తున్నారంటూ సదరు విద్యార్థి తన తండ్రికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో భయాందోళనకు గురైన పలువురు విద్యార్థినులు ఇప్పటికే హాస్టల్‌ను వీడి ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం.
కళాశాల ఎదుట ఆందోళన.. ఉద్రిక్తత
ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అరోరా కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థినుల భద్రతకు భరోసా కల్పించాల్సిన హాస్టల్ సిబ్బందిపైనే ఇలాంటి ఆరోపణలు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు కళాశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు.
ఈ ఘటనపై బాధితుల నుంచి భువనగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మెస్ ఇంచార్జీ పృథ్వీ, వార్డెన్ రేవతిని వేర్వేరుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిలోని డేటాను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థినుల భద్రతకు సంబంధించిన ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదువు కోసం తమ కుమార్తెలను హాస్టల్‌కు పంపిస్తే ఇలాంటి ఆరోపణలు ఎదురుకావడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

