గణపతి మండపాలకు అనుమతులు.. ఎస్పీ కీలక ఆదేశాలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో :  మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 14న సోమవారం వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతులు పొందాలని జిల్లా ఎస్పీ (Mahabubnagar SP) డి.జానకి (Janaki) సూచించారు. విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఇందుకోసం policeportal.tspolice.gov.in లో దరఖాస్తుదారుల వివరాలు, విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్ స్టేషన్, ప్రతిష్ఠాపన తేదీ, నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం, నిమజ్జన వాహనం తదితర వివరాలను నమోదు చేయాలని సూచించారు.

అలాగే గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులు, వాలంటీర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలను కూడా నమోదు చేయాలని ఎస్పీ తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసే ప్రతి గణపతి మండప నిర్వాహకుడు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ నమోదులో ఇబ్బందులు ఎదురైతే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ తీగలు, రోడ్డు మార్గాలు, ఇతర వాహనాలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. విగ్రహాల తరలింపు వాహనాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అధిక వేగంతో ప్రయాణించకుండా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ వైరింగ్, జనరేటర్లు, టెంట్ల ఏర్పాటులో భద్రతా చర్యలు పాటించాలని, అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినాయక నవరాత్రులను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని, ఇతరులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఎస్పీ డి.జానకి కోరారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>