భదాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ తనిఖీలు.. పలువురికి షోకాజ్ నోటీసులు

​కలం, ఖమ్మం బ్యూరో: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ (Collector Ankit) అంకిత్‌ తీవ్రంగా హెచ్చరించారు. గురువారం దమ్మపేట మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్వారిగూడెం పీహెచ్‌సీలో వైద్య పరికరాలు మూలనపడటంపై వైద్యాధికారులకు గట్టిగా క్లాస్ పీకారు. మదనపల్లి గురుకులంలో అపరిశుభ్రత, మెనూ ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

​పట్వారిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌ను పరిశీలిస్తున్న సమయంలో రూ. 3 లక్షల విలువైన అనాలసిస్ యంత్రం ఏడాది కాలంగా పనిచేయడం లేదని తెలిసి అసంతృప్తి చెందారు.

​అనంతరం మదనపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. డిజిటల్ క్లాస్‌రూమ్‌లలో చెత్తాచెదారం, డైనింగ్ హాల్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై మండిపడ్డారు. విద్యార్థుల భోజనంలో మెనూ ప్రకారం అందించకపోవడంతో మండిపడ్డారు. పిల్లల భోజనం, ఆరోగ్యం విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులైన ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి, పరిసరాల పరిశుభ్రతపై తక్షణ చర్యల ఫొటోలు పంపాలని సూచించారు.

గండుగులపల్లి మోడల్ సోలార్ గ్రామ అభివృద్ధి పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని 424 గృహజ్యోతి లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 242 ఇళ్లలో రూ.2 లక్షల వ్యయంతో 2 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తికావడంపై అధికారులను వివరాలు అడిగారు. మిగిలిన ఇళ్లలో కూడా పనులను వేగవంతం చేసి, గ్రామాన్ని ఆదర్శవంతమైన మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్, దమ్మపేట తహసీల్దార్ మురళి ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>