కలం, వెబ్ డెస్క్: శాకాహారుల్లో ప్రోటీన్ లోపం సమస్య తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటడటం కోసం వారు నానా తంటాలు పడుతుంటారు. వైద్యులను సంప్రదించినా పెద్దగా లాభం ఉండదు. అందుకు కారణం శాకాహారం ద్వారా ప్రొటీన్ కావాల్సిన మొత్తంలో దొరకడం చాలా కష్టం. చాలామంది ప్రోటీన్ అంటే పన్నీర్ లేదా సోయాబీన్ మాత్రమే గుర్తు చేసుకుంటారు. కానీ పోషకాహార నిపుణులు మాత్రం శాకాహారంలో ప్రొటీన్ రిచ్ ఫుడ్స్‌కు ఢోకానే లేదని చెబుతున్నారు. అయితే విడివిడిగా కాకుండా కొన్ని ఆహారాలను సరైన కాంబినేషన్‌లో తీసుకుంటే ప్రోటీన్ పరిమాణం గణనీయంగా పెరుగుతుందని సూచిస్తున్నారు. శాకాహారులు మంచి వెజిటేరియన్ ఫుడ్ (Best Vegetarian Food) తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బాదం-పెరుగు
10 గ్రాముల నానబెట్టిన బాదంను అర కప్పు పెరుగుతో తీసుకుంటే సుమారు 10 నుంచి 12 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని తెలిపారు. బాదంలో లేని కొన్ని అమినో ఆమ్లాలను పెరుగు పూర్తి చేస్తుందని వివరించారు.
మఖానా-పీనట్ బట్టర్
ఒక బౌల్ రోస్టెడ్ మఖానాతో పాటు ఒక టేబుల్ స్పూన్ నేచురల్ పీనట్ బట్టర్ తీసుకుంటే దాదాపు 12 గ్రాముల ప్రోటీన్ అందుతుందని చెప్పారు. ఈ కాంబినేషన్‌లో అమినో ఆమ్లాల సమతుల్యత మెరుగవుతుందని తెలిపారు.
చియా సీడ్స్-పెరుగు
ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌ను ఒక కప్పు పెరుగులో నానబెట్టి తీసుకుంటే 12 నుంచి 14 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుందని పేర్కొన్నారు. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందని చెప్పారు.
బక్‌వీట్-పెరుగు
ఒక కప్పు బక్‌వీట్ పిండితో రొట్టె లేదా టిక్కీ తయారు చేసి అర కప్పు పెరుగుతో తీసుకుంటే సుమారు 15 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని తెలిపారు.
రాజగిరా-నట్స్
ఒక కప్పు రాజగిరాతో చేసిన పొరిజ్‌ను ఒక టేబుల్ స్పూన్ నట్స్‌తో తీసుకుంటే 15 నుంచి 16 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని చెప్పారు. రాజగిరా స్వయంగా మంచి ప్రోటీన్ ఆహారమని, నట్స్‌తో తీసుకుంటే పోషక విలువ పెరుగుతుందని వివరించారు.
పీనట్ బట్టర్ టోస్ట్
రెండు చిన్న హోల్‌వీట్ టోస్ట్‌లపై రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బట్టర్ వేసుకుని తీసుకుంటే సుమారు 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని తెలిపారు.
హంగ్ కర్డ్-పంబ్కిన్ సీడ్స్
170 గ్రాముల హంగ్ కర్డ్‌తో పాటు రెండు టేబుల్ స్పూన్లు పంబ్కిన్ సీడ్స్ తీసుకుంటే 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ అందుతుందని చెప్పారు.
గ్రీక్ యోగర్ట్-హెంప్ సీడ్స్
ఒక కప్పు గ్రీక్ యోగర్ట్‌లో రెండు టేబుల్ స్పూన్లు హెంప్ సీడ్స్ కలిపితే దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని తెలిపారు. ఇది శాకాహారులకు అత్యంత ఉపయోగకరమైన ప్రోటీన్ కాంబినేషన్‌గా పేర్కొన్నారు.
క్వినోవా-పెరుగు
ఒక బౌల్ వండిన క్వినోవాతో పాటు ఒక కప్పు పెరుగు తీసుకుంటే సుమారు 25 గ్రాముల ప్రోటీన్ అందుతుందని వివరించారు.
అత్యధిక ప్రోటీన్ కాంబినేషన్
ఒక కప్పు హంగ్ కర్డ్, ఒక టేబుల్ స్పూన్ పీనట్ బట్టర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ పంబ్కిన్ సీడ్స్ లేదా హెంప్ సీడ్స్ కలిపి తీసుకుంటే దాదాపు 30 గ్రాముల వరకు పూర్తి శాకాహార ప్రోటీన్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శాకాహారులు సరైన ఆహార కాంబినేషన్లు పాటిస్తే రోజువారీ ప్రోటీన్ అవసరాన్ని సులభంగా తీర్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

