కలం, వనపర్తి: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని, సమాజానికి స్ఫూర్తిదాయకమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల (Police Martyrs) దినోత్సవం సందర్భంగా బుధవారం వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ప్రజల భద్రత కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మేఘారెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ సమాజ భద్రత కోసం వారు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువకూడదన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డి.సునీతారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, ఎస్ఎల్ఎన్ రమేష్, డీఎస్పీ గిరిబాబు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

