కలం, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా (Australia) గడ్డపై టెస్టు ఆడిన బంగ్లాదేశ్.. తొలి మ్యాచ్‌లోనే కంగారూలను మట్టికరిపించడం విశేషం.ఈ చారిత్రక విజయంపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ (Tarique Rahman) జట్టుకు అభినందనలు తెలిపారు.
ఆటగాళ్ల పట్టుదల, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, సమష్టి కృషి ఫలితంగానే బలమైన ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ గెలుపు బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఎంతో గర్వకారణమని అన్నారు. విజయం ఖరారైన సమయంలో ప్రధాని తారిఖ్ రెహ్మాన్ కిషోర్గంజ్కు వెళ్తున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన బంగ్లాదేశ్ క్రికెటర్లతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది, విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. బంగ్లాదేశ్ ప్రజల తరఫున జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆస్ట్రేలియాపై టెస్టుల్లో బంగ్లాదేశ్(Bangladesh)కు ఇది రెండో విజయం. 2017లో మిర్పూర్లో జరిగిన టెస్టులో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించింది. తాజాగా ఆస్ట్రేలియా సొంతగడ్డపైనే విజయం సాధించి మరో అరుదైన ఘనతను అందుకుంది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టులోనూ ఇదే జోరు కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును దాని సొంతగడ్డపైనే ఓడించడం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ విజయంగా నిలిచిపోనుంది.
Also Read : మళ్లీ ప్రపంచ పోరుకు సింధు సై.. సవాలుకు సిద్ధం!
Follow Us On: Sharechat

