కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ ఎన్నికపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్నది ఎంసీల్ బంధమని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బండి సంజయ్ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పారు.
కరీంనగర్ లో ఈ మూడు పార్టీలకు కలిపి 22 సీట్లు ఉన్నాయని, బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా చేసేందుకే వీరంతా ఒక్కటయ్యారని బండి ఆరోపించారు. వీరి చిల్లర రాజకీయాలు, కుట్రలు త్వరలోనే కరీంనగర్ వేదికగా బయటపడతాయని పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఫోన్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెబుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ నేతలతో మాట్లాడాలని కాంగ్రెస్ కూడా సూచిస్తోందని, ఇది వారి రహస్య ఒప్పందానికి నిదర్శనమని మండిపడ్డారు.
కరీంనగర్ ప్రజలు స్పష్టంగా బీజేపీకి ఓటు వేశారని, ప్రజా తీర్పును గౌరవించకుండా మేయర్ పదవిని అడ్డుకోవాలని చూస్తే కరీంనగర్ దమ్మేంటో చూపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కరీంనగర్ మేయర్ పీఠం మాత్రం కచ్చితంగా బీజేపీదేనని బండి సంజయ్ (Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు.


