కలం, వెబ్‌డెస్క్: చిన్నపిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిఒక్కరూ అరటిపండు (Banana) ను ఇష్టపడుతుంటారు. ఇది తక్కువ ధరలో సులభంగా లభించే పండు మాత్రమే కాదు, అనేక పోషక విలువలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం. అంతే కాకుండా సంవత్సరం పొడవునా, అని సీజన్లలో లభించే పండును ప్రతిరోజూ తినవచ్చా అనే సందేహం కొంతమందికి కలుగుతుంది. అరటి పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Banana Benefits) గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
మనందరికీ ఎంతో ఇష్టమైన పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండులో పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C, ఐరన్, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అరటిపండులో ఉండే సహజ చక్కెరలు అయిన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. అందుకే క్రీడాకారులు, ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు అరటిపండును తమ ఆహారంలో భాగంగా తీసుకుంటారు. ఉదయం అల్పాహారంలో అరటిపండు తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు అరటిపండులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరం. పండిన అరటిపండును తేనె, పాలతో కలిపి తీసుకుంటే కడుపులో అల్సర్లు లేదా గాయాలు తగ్గడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపు సమస్యలు ఉన్నవారు అరటిపండును పరిమితంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. చర్మం, కళ్ల ఆరోగ్యానికి కూడా అరటిపండు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయట.
చాలామంది అరటిపండుతో ఫేస్‌ప్యాక్‌లు తయారు చేసుకుని చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా ఇందులోని మాంగనీస్ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలకు అరటిపండు మంచి పోషకాహారంగా భావిస్తారు. ఇది శరీర బలహీనతను తగ్గించి శక్తిని అందిస్తుంది. అలాగే వికారం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అరటిపండు సాధారణ పండు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే సహజ ఔషధం అని చెప్పవచ్చు. రోజువారీ ఆహారంలో అరటిపండును భాగం చేసుకుంటే శరీరానికి కావలసిన శక్తి, పోషకాలు లభించడంతో పాటు అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

