కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) పట్టణంలో తమ కులవృత్తిగా కొనసాగిస్తున్న మాంసం వ్యాపారాన్ని ఇతర వ్యక్తులు పెద్ద ఎత్తున నిర్వహించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆరే కటిక సంఘం (Are Katika Association) ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ కపుల్ దేశాయ్‌ను కలిసి పట్టణ ఆరే కటిక సంఘం అధ్యక్షుడు హీరేకార్ మధు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. కటిక కులస్తులు తరతరాలుగా చిన్నచిన్న మాంసం దుకాణాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. అయితే ఇటీవల ఇతర వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో మాంసం దుకాణాలను ఏర్పాటు చేయడంతో చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమ కులవృత్తిపై ఆధారపడిన అనేక కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మాంసం దుకాణాలపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. తమ కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న చిన్న వ్యాపారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆరే కటిక సంఘం నాయకులు నాంతబాద్ సతీష్, గజభీంకార్ నారాయణ, గోగికార్ రమేష్, కోయల్‌కార్ రఘ, కోయల్‌కార్ గౌరాజి, రవి, వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

