కలం, వెబ్ డెస్క్ : ఉపకారవేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ వైద్యులు (జూడాలు) చేపట్టిన సమ్మె (Junior Doctors Strike) తీవ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే ఆందోళనకు దిగిన జూడాలు.. రేపటి నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించాలని నిర్ణయించారు. జూడాల పిలుపు నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ, ఐసీయూ విభాగాల్లో నిరంతర వైద్య సేవలు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు సమ్మె ప్రభావం రోగులపై పడకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైద్య సిబ్బంది సెలవుల విషయంలోనూ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ లీవులు మినహా అన్ని రకాల సెలవులను రద్దు చేసింది. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడకుండా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

