కలం, కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యం (MRI Facility) అందుబాటులో లేకపోవడంతో పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐవైఎఫ్ (AIYF) జిల్లా కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్ అన్నారు. నాలుగు జిల్లాలకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సౌకర్యం లేకపోవడం విచారకరమన్నారు. ఎంఆర్ఐ అవసరమైన రోగులను ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించాల్సి రావడంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది మరింత భారంగా మారుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటే రోగులకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని పేర్కొన్నారు.
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పూర్తి స్థాయి ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని వెంటనే ఏర్పాటు చేసి, నిరంతరాయంగా సేవలు అందించాలని ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను డిమాండ్ చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఎంఆర్ఐ సౌకర్యం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు చేపడతామని యుగంధర్ హెచ్చరించారు. అలాగే సమస్యకు నైతిక బాధ్యత వహించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

