పరవళ్లు తొక్కుతున్న భద్రాద్రి ఏజెన్సీ వాగులు, వంకలు

కలం, ఖమ్మం బ్యూరో : ​దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉద్భవించిన తీవ్ర వాయుగుండం భద్రాద్రి ఏజెన్సీ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా అడుగులు వేస్తూ, రాయ్‌పూర్, బిలాస్‌పూర్ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టడంతో విశాలమైన ఆకాశం కాస్తా నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఎగువన కురుస్తున్న భీకర వర్షాల ధాటికి ఏజెన్సీలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.

​అటవీ ప్రాంతాల్లో కురిసిన వాన నీరంతా ఒక్కసారిగా ప్రవాహమై రావడంతో చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. చింతవాగు, పగిడివాగు, రాళ్ల వాగుల నుంచి ఉధృతంగా వచ్చి చేరుతున్న ప్రవాహంతో జలాశయం హోరెత్తిపోయింది. నిమిష నిమిషానికి పెరుగుతున్న వరదను తట్టుకోవడానికి అధికారులు ప్రాజెక్టు 15 గేట్లను పైకెత్తారు. దాంతో ఏకంగా 65 వేల క్యూసెక్కుల నీరు నురగలు కక్కుతూ దిగువ గోదావరి వైపు పరుగులు తీస్తుంది. తేగడలోని హైలెవెల్ వంతెనను తాకుతూ పరవళ్లు తొక్కుతున్న తాలిపేరు ప్రవాహం ప్రకృతి ఉగ్రరూపానికి అద్దం పడుతుంది. డీఈ తిరుపతి ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని శ్రీగుబ్బల మంగమ్మ తల్లి ఆలయ పరిసరాలు వరద నీటితో జలమయమయ్యాయి. అక్కడ నుంచి ఉప్పొంగిన ప్రవాహమంతా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ​ఏజెన్సీ వ్యాప్తంగా వాగులు పొంగిపొర్లి, జనజీవనం స్తంభించిపోవడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఒక్కసారిగా విరుచుకుపడిన తుఫాను భయం, వరద ఉధృతి గ్రామాలను వణికించినప్పటికీ… ఎండిపోతున్న దశలో ఉన్న వరి పంటలకు ఈ వర్షాలు ప్రాణవాయువులా మారాయి. సమయానికి కురిసిన ఈ వాన దేవుడి దీవెనలా భావిస్తూ అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

​ఇటు కూసుమంచిలోని పాలేరు జలాశయం వద్ద కూడా వరద పోటు వేగంగా పెరిగింది. ఉదయం కేవలం 700 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం, ఎగువన కురిసిన వర్షాలతో ఏకంగా 11,389 క్యూసెక్కులకు చేరింది. 19.75 అడుగులుగా ఉన్న నీటిమట్టం ఒక్కసారిగా 22 అడుగులకు పెరగడంతో, నీటి నిల్వ 2.203 టీఎంసీలను తాకింది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఈఈ వెంకటేశ్వర్లు నేతృత్వంలో సిబ్బంది 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ఆటోమేటిక్ ఫాలింగ్ గేట్లను సిద్ధం చేశారు.

మరో పక్క వైరా రిజర్వాయర్లో నీటి మట్టం 19.3 అడుగులకు చేరింది.​దీంతో జిల్లా వ్యాప్తంగా 5,09,978 ఎకరాల్లో వరి, పత్తి పంటలు సాగు చేస్తున్న రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ వర్షాల వల్ల ఆయకట్టు పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తీరడంతో పాటు, ఖమ్మం నగర తాగునీటి అవసరాలు కూడా పూర్తిస్థాయిలో తీరుతాయని అధికారులు తెలిపారు.

​మరోవైపు తాలిపేరు నీరు గోదావరిలో కలుస్తున్నప్పటికీ, భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 20.20 అడుగుల వద్ద నియంత్రణలోనే ఉంది. 1,82,926 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు కావడంతో భద్రాచలానికి ప్రస్తుతానికి ముప్పు లేకపోయినా, రాబోయే 12 గంటల్లో వాయుగుండం బలహీనపడే వరకు నీటిపారుదల, రెవెన్యూ యంత్రాంగం నిరంతరం కాపలా కాస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>