కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన ఏఐసీసీ, సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 81 మందితో కూడిన నూతన ఏఐసీసీ కార్యదర్శుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇప్పటివరకు ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగిన తెలంగాణ సీనియర్ నేత, ఎస్.ఏ. సంపత్ కుమార్ కు (Sampath Kumar) చోటు కల్పించలేదు. ఆయన్ని ఆ బాధ్యతల నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది. ఇసుక మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సంపత్ కుమార్ పై అధిష్టానం వేటు వేసిందనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ తాజా నియామాకాల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు నేతలకు జాతీయ స్థాయిలో కీలక అవకాశాలు లభించాయి. రాష్ట్ర నేత సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీని పొరుగు రాష్ట్రమైన కర్ణాటక వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శిగా నియమించగా, కోలుకొండ సంతోష్‌కు పార్టీ శిక్షణ, అలాగే సందేశ్ విభాగ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఒడిశా రాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శిగా సేవలందిస్తున్న జెట్టి కుసుమ్ కుమార్‌పై అధిష్టానం మరోసారి నమ్మకం ఉంచింది. ఆయనను అదే పదవిలో కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రానున్న ఎన్నికలు, పార్టీ కార్యక్రమాల అమలును దృష్టిలో ఉంచుకుని జాతీయ స్థాయిలో ఈ భారీ ప్రక్షాళన జరిగినట్లు తెలుస్తోంది.

