గిరిజన యువతకు విద్యే అసలైన బలం: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : ఆదివాసీ గ్రామాల సమగ్ర అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని, గిరిజన యువత జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చదువే బలమైన ఆయుధమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) అన్నారు. ఆదివారం సిరికొండ మండలం కోసుపటేల్ గూడ (Kosupatel Guda) గ్రామంలో ఇంద్రవెల్లి అమరవీరుడు పెందూర్ మచ్చు కుటుంబ సభ్యులైన దుర్గాబాయి–ఆనంద్ రావు దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం గ్రామంలో కల్వర్టు, ఇతర మరమ్మతుల పనులకు భూమిపూజ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కోసుపటేల్ గూడలో గతంలో ఎల్-3 జాబితాలో ఉన్న లబ్ధిదారులను ఎల్-1 జాబితాకు మార్పు చేయించి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలు, వీవోలు, అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరైన నూతన భవనాల నిర్మాణాలతో పాటు పెండింగ్ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు.

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు బాలికలకు సంపూర్ణ మద్దతు అందిస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ శివరామ్, తహశీల్దార్ అరవింద్ కుమార్, ఎంపీడీవో రఘువీర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ డీఈ రమేష్, సర్పంచ్ గణపతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>