కలం, ఆదిలాబాద్ : విద్యార్థుల్లో ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించేందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్ ( Adilabad) జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అదనపు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో ఈ పోటీలను పకడ్బందీగా నిర్వహించామని, ఇందులో భాగంగా తొలుత జిల్లాలోని 90 పాఠశాలలు, 17 కళాశాలల్లో నవంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ప్రాథమిక స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగిందని వివరించారు. నవంబరు 10 నుంచి 13 వరకు నియోజకవర్గ స్థాయిలో పోటీలు జరిగాయని, ఇందులో ప్రతిభ కనబరిచిన ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు చెందిన 61 మంది విద్యార్థులకు నేడు జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఎన్నికల పర్యవేక్షణ అధికారిణి నలంద ప్రియ, నాయబ్ తహసీల్దార్లు మధుసూదన్, సూరజ్, ఇస్తారి, కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

