మూడు దశాబ్దాల కల.. మళ్లీ తెరపైకి ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్ రైల్వే లైన్!

కలం, నిర్మల్: దశాబ్దాలు గడిచాయి.. ప్రభుత్వాలు మారాయి.. సర్వేలు జరిగాయి.. హామీలు వినిపించాయి.. కానీ రైలు కూత మాత్రం వినిపించలేదు. వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల మూడు దశాబ్దాల చిరకాల ఆకాంక్ష అయిన ఆదిలాబాద్ – నిర్మల్ – ఆర్మూర్ (Adilabad – Armoor Railway Line) రైల్వే లైన్ ఇప్పుడు మార్గ మార్పుల రీసర్వేతో మరోసారి ఆశలు రేకెత్తిస్తోంది. దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హయాంలో పురుడుపోసుకున్న ఈ ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని, రైల్వే లైన్ సాధన సమితి ప్రతిపాదన ప్రయత్నాలతో మళ్లీ ముందుకు కదులుతోంది.

జాతీయ రహదారి వెంబడి కాకుండా మారుమూల గిరిజన, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదిస్తున్న కొత్త మార్గం అభివృద్ధికి బాటలు వేయనుంది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించే అవకాశాలు, కొత్త ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, నిర్మల్ రైల్వే జంక్షన్‌గా ఎదిగే అవకాశాలు ఆశలు కలిగిస్తున్నాయి. అయితే రీసర్వే పూర్తయి, తుది అనుమతులు, నిధులు లభించి, పట్టాల నిర్మాణం ప్రారంభమైతేనే మూడు దశాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కుతుంది.

మూడు దశాబ్దాలుగా నెరవేరని కల..

ప్రాంతీయ అభివృద్ధికి రహదారులతోపాటు రైల్వే మార్గాలు అత్యంత కీలకం. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో రైల్వే సౌకర్యం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు కొత్త అవకాశాలు కల్పిస్తుంది. ఈ దూరదృష్టితోనే నాటి ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు దేశవ్యాప్తంగా నూతన రైల్వే మార్గాల సర్వేలకు ప్రాధాన్యమిస్తూ, వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్ర రాజధానికి చేరువ చేసేలా ఆర్మూర్‌(Adilabad – Armoor)తో అనుసంధానించే రైల్వే లైన్ సర్వేకు ప్రత్యేక చొరవ చూపారు. అయితే సర్వే అనంతరం ప్రాజెక్టు నిర్మాణ దశకు చేరుకోలేదు. ప్రభుత్వాలు మారినా, దశాబ్దాలు గడిచినా ప్రతిపాదనలు, సర్వేలు, హామీల మధ్య రైల్వే లైన్ కల సాకారం కాలేదు.

రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలేక ముందుకు సాగని ప్రాజెక్టు

తదనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ రైల్వే మార్గాన్ని నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా భరించాల్సిన అంశం కీలకంగా మారింది.అయితే, అప్పటి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సమకూర్చడంలో ముందడుగు వేయలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. నిధుల భాగస్వామ్యంపై స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు పురోగతి మరోసారి నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వెనుకబడిన ప్రాంతాల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చే విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం కొత్త ఆశలను రేకెత్తించింది.

రైల్వే లైన్ సాధన సమితి కృషితో మళ్లీ కదలిక..

ఆదిలాబాద్ – నిర్మల్ – ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి వివిధ దశల్లో చేసిన ప్రయత్నాలతో ప్రాజెక్టు తిరిగి చర్చలోకి వచ్చింది. 2023లో ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి ప్రాజెక్టు ఆవశ్యకతను, మార్గ మార్పుల ప్రతిపాదనలను తీసుకెళ్లింది. గత ప్రతిపాదిత మార్గానికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ ప్రక్రియలు ఇప్పటికే పూర్తయినప్పటికీ, వెనుకబడిన గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని కోరింది.

ముఖ్యంగా కుప్టి, మహబూబ్ ఘాట్ ప్రాంతాలను తప్పించడం ద్వారా కొండల కోతలు, భారీ వంతెనలు, క్లిష్టమైన నిర్మాణాలను తగ్గించి, వ్యయాన్ని ఆదా చేయడంతోపాటు పనులను వేగంగా పూర్తి చేయవచ్చని వివరించింది. ప్రత్యామ్నాయ మార్గంలో భూసేకరణ, అటవీ అనుమతులు, సొరంగాలు, వంతెనల అవసరాలను సమగ్రంగా పరిశీలించాలని నొక్కిచెప్పింది.

రవాణా సౌకర్యాలు లేని గ్రామాల వైపు..

గతంలో అత్యవసర పరిస్థితుల్లో రైల్వే నిర్వహణ, మరమ్మతులు, సహాయక చర్యలకు రహదారి సౌకర్యం అవసరమనే ఉద్దేశంతో ఆదిలాబాద్ నుంచి నేరడిగొండ మీదుగా జాతీయ రహదారి – 44 వెంబడి నిర్మల్‌కు రైల్వే లైన్ ప్రతిపాదించారు. అయితే, ఇప్పటికే రహదారి సౌకర్యమున్న ప్రాంతాలకంటే రవాణా వసతులు లేని మారుమూల గ్రామాలకు రైల్వే సేవలు విస్తరించడం సామాజికంగా మరింత ప్రయోజనకరమనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో కొత్త సర్వేలో ఆదిలాబాద్ నుంచి బరంపూర్, బజార్‌హత్నూర్, సొనాల, కౌఠ, కన్గుట్ట, పొచ్చెర, కుచులాపూర్, ధన్నూర్ మీదుగా అడెల్లి పోచమ్మ పుణ్యక్షేత్రానికి సమీపంగా నిర్మల్ చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తున్నారు. పాత మార్గంతో పోలిస్తే దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలో మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తుది మార్గం, స్టేషన్ల స్థానాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

136 కిలోమీటర్లు.. రూ.4,500 కోట్ల అంచనా..

ఆదిలాబాద్ – నిర్మల్ – ఆర్మూర్ రైల్వే మార్గం పొడవు సుమారు 136 కిలోమీటర్లు కాగా, నిర్మాణ వ్యయం దాదాపు రూ.4,500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే మార్గ మార్పులు, నిర్మాణ పద్ధతులు, భూసేకరణ వ్యయం ఆధారంగా ఈ అంచనాల్లో మార్పులు రావచ్చు. చివరిదశలో ఇటీవల తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసినప్పుడు, ఇప్పటికే రైల్వే బోర్డు ద్వారా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం పొందిందని, ఈ ప్రాజెక్టుకు రైల్వే బోర్డు నుండి తుది అనుమతులు లభించిన తర్వాత, రాబోయే కేంద్ర బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో నిధులు కేటాయించే అవకాశం ఉందని మంత్రి తెలియజేయడం గమనార్హం.

సొరంగాలు, అటవీ అనుమతులు, భూసేకరణ సవాళ్లు..

రైల్వే మార్గ నిర్మాణంలో భూసేకరణ, అటవీ భూముల వినియోగం, కొండ ప్రాంతాల్లో నిర్మాణం ప్రధాన సవాళ్లుగా నిలవనున్నాయి. ప్రతిపాదిత ప్రాజెక్టు వివరాల్లో ఆరు ప్రాంతాల్లో సుమారు 8.34 కిలోమీటర్ల పొడవున సొరంగ మార్గాల నిర్మాణ అంశం ప్రస్తావనకు వచ్చింది. నిర్మల్ సమీపంలోని చించోలి, అడెల్లి, నేరడిగొండ మండలంలోని బుద్దికొండ, గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ పరిసరాల్లో సొరంగ మార్గాల అవసరాన్ని పరిశీలించినట్లు సమాచారం. అయితే తాజా మార్గ మార్పుల నేపథ్యంలో గత సొరంగ ప్రతిపాదనలు యథాతథంగా కొనసాగుతాయా, వాటి అవసరం తగ్గుతుందా అనే అంశాలపై తుది సాంకేతిక నివేదిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

గోదావరిపై రైల్వే వంతెన నిర్మాణం కీలకం..

రైల్వే లైన్‌లో గోదావరిపై పొడవైన వంతెన నిర్మాణం కీలకం కానుంది. వరద ప్రవాహం, గరిష్ఠ నీటిమట్టం, నదీగర్భ పరిస్థితులు, పునాదుల పటిష్ఠతను పరిశీలించి, నది వెడల్పు, గట్టి రాతిపొరల ఆధారంగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేస్తే వ్యయం, సమయం తగ్గుతాయి. ఆధునిక సాంకేతికత, ప్రీకాస్ట్ పద్ధతులతో పనులు వేగవంతం చేయవచ్చు. వర్షాకాలానికి ముందే పునాదులు నిర్మిస్తే వరదల అంతరాయాలు తగ్గుతాయి.

వంతెన పొడవు, స్తంభాల సంఖ్య, పునాదుల లోతును బట్టి వ్యయం నిర్ణయించాలి. భద్రత, నాణ్యతలో రాజీపడకుండా, అనుమతులు, నిధులు అందుబాటులో ఉంటే నిర్మాణ సంక్లిష్టతను బట్టి నిర్దిష్టకాలంలో పూర్తి చేసే అవకాశముంది. తుది కాలపరిమితి సాంకేతిక నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఇతర రైల్వే పనులతో సమాంతరంగా ప్రత్యేక ప్రణాళికతో వంతెన నిర్మిస్తే మొత్తం ప్రాజెక్టు కాలాన్ని తగ్గించవచ్చు.

గిరిజన ప్రాంతాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే అవకాశం..

ఈ రైల్వే లైన్ (Adilabad – Armoor) నిర్మాణం కేవలం ప్రయాణ సౌకర్యానికి మాత్రమే పరిమితం కాదు. ఆదిలాబాద్, బజార్‌హత్నూర్, బోథ్, నిర్మల్ పరిసరాల్లోని వ్యవసాయ, గిరిజన, గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇది ముఖ్యమైన మౌలిక వసతిగా మారవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులను సుదూర మార్కెట్లకు తరలించడానికి, చిన్న వ్యాపారాలను విస్తరించడానికి, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడానికి రైల్వే అనుసంధానం ఉపయోగపడుతుంది. ఉన్నత విద్య, వైద్య అవసరాల కోసం పెద్ద నగరాలకు వెళ్లే విద్యార్థులు, రోగులు, సాధారణ ప్రజలకు ప్రయాణం మరింత అందుబాటులోకి రావచ్చు. ప్రత్యేకించి అడెల్లి పోచమ్మ పుణ్యక్షేత్రం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు రైల్వే అనుసంధానం ఏర్పడితే యాత్రికుల రాకపోకలు పెరిగి స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం లభించవచ్చు.

రైల్వే జంక్షన్ ఏర్పాటయ్యే అవకాశాలు..

నిర్మల్ మీదుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పడమరన నాందేడ్, ముంబై, తూర్పున మంచిర్యాల, కన్యాకుమారి వరకు, ఉత్తరాన నాగ్పూర్, దేశ రాజధాని ఢిల్లీ వంటి ఇతర ప్రధాన నగరాలతో భవిష్యత్తులో మెరుగైన రైల్వే అనుసంధానం ఏర్పడే అవకాశాలపైనా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. నూతన మార్గాన్ని ఆధునిక ప్రమాణాలతో నిర్మిస్తే భవిష్యత్తులో వేగవంతమైన రైళ్ల నిర్వహణకు అనువైన మౌలిక వసతులను అభివృద్ధి చేయవచ్చు. అయితే హైస్పీడ్ రైళ్ల నిర్వహణ, నగరాల మధ్య నేరుగా రైలు సేవలు ప్రారంభించడం వంటి అంశాలు ప్రత్యేక సాంకేతిక పరిశీలన, రైల్వే శాఖ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.

సర్వేలకే పరిమితం కాకూడదు: నంగె శ్రీనివాస్, రైల్వే లైన్ సాధన సమితి అధ్యక్షుడు

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజలకు మరో సర్వే సరిపోదు. అనుమతులు, నిధుల కేటాయింపులు పూర్తయి నిర్మాణ పనులు ప్రారంభమైనప్పుడే వారి ఆకాంక్ష నెరవేరుతుందని నంగె శ్రీనివాస్ అన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తుది మార్గాన్ని ఖరారు చేసి, భూసేకరణ, అటవీ, సాంకేతిక అనుమతులు, నిధుల విడుదలను వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు పూర్తికి స్పష్టమైన కాలపరిమితితో, ప్రతి దశ పురోగతిని ప్రజలకు తెలియజేసే పారదర్శక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. సర్వేలు కాదు.. రైల్వే పట్టాలు పరచడమే అసలు లక్ష్యమన్నారు. రైలు కూత వినిపించినప్పుడే ప్రజల చిరకాల ఆకాంక్ష నిజమైన అభివృద్ధిగా మారుతుందని పేర్కొన్నారు.

Also Read : పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమిష్టి పోరుకు సీఎం రేవంత్ పిలుపు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>