కలం, దేవరకొండ: తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో డిండి రిజర్వాయర్ (Dindi Reservoir) లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో, ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలను కాపాడేందుకు తక్షణమే నీటిని విడుదల చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు నియోజకవర్గంలోని రైతాంగ పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండి రిజర్వాయర్‌కు అత్యవసర ప్రాతిపదికన నీటిని విడుదల చేయాలని కోరారు. వర్షాభావం కారణంగా డిండి ప్రాజెక్టు పరిధిలో నీటి కొరత తీవ్రంగా మారిందని, సమయానికి సాగునీరు అందక ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే వివరించారు.
ఇప్పటికే పంటలపై నీటి ఎద్దడి ప్రభావం పడిందని, నీటి విడుదలలో మరింత ఆలస్యం జరిగితే పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండి రిజర్వాయర్‌కు వెంటనే నీటిని పంపింగ్ చేసేలా సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకుని నీటిని విడుదల చేస్తేనే డిండి ఆయకట్టు రైతాంగానికి ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు.

