Mobile Popup Ad
Mobile Popup Ad

బైక్ స్టంట్లతో రెచ్చిపోతున్న యువత.. ఆట కట్టించిన పోలీసులు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు (Kusumanchi Police).. సోషల్ మీడియాలో ‘లైకులు’, ‘రీల్స్’ క్రేజ్ కోసం బైక్‌లపై ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఇద్దరు యువకుల ఆట కట్టించారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు యువకులను ఖమ్మం టాస్క్ ఫోర్స్, కూసుమంచి ఎస్సై నాగరాజు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ వెల్లడించారు.

​ఇటీవల కాలంలో ఖమ్మం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై కొందరు యువకులు ప్రమాదకర రీతిలో బైక్ స్టంట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీస్ సోషల్ మీడియా బృందం, ఈ విన్యాసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించింది. ఈ క్రమంలోనే కూసుమంచి (Kusumanchi) మండలం పరికసింగారం గ్రామానికి చెందిన మాదవరుపు శివ రామకృష్ణ (20), కోక్య తండాకు చెందిన బానోత్ జశ్వంత్ (18) అనే ఇద్దరు యువకులను పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. వీరిపై మోటారు వాహన చట్టంతో పాటు పబ్లిక్ న్యూసెన్స్ కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. రోడ్లపై బైక్ విన్యాసాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలు స్టంట్లు చేసే యువకుల ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే అమాయక పాదచారులకు, ఇతర వాహనదారులకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

​ఈ ప్రమాదకర ధోరణిపై ఏసీపీ సత్యనారాయణ తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు బైక్‌లు ఇవ్వకూడదని, అదేవిధంగా పిల్లల రోజువారి కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ ఉండాలని కోరారు. చట్టవిరుద్ధమైన, ప్రాణాపాయం కలిగించే ఇలాంటి పనులకు దూరంగా ఉండేలా వారికి ఇంట్లోనే కౌన్సిలింగ్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ​క్షణికానందం కోసం, సోషల్ మీడియాలో వచ్చే కొన్ని లైకుల కోసం యువత తమ విలువైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. మోటారు వాహన చట్టం ప్రకారం నిర్లక్ష్యపు డ్రైవింగ్, రేసింగ్‌లకు పాల్పడితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రహదారులపై ప్రజల భద్రతకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే, వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also: కాంగ్రెస్ మంత్రి ప్రమాణ స్వీకారంలో వివాదం.. గవర్నర్ అభ్యంతరం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>