Mobile Popup Ad
Mobile Popup Ad

మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి: మంత్రి తుమ్మల

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆదేశించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మొక్కజొన్న కొనుగోళ్లు (Maize Procurement), నిల్వ సౌకర్యాలు, గన్ని బ్యాగుల లభ్యత, రవాణా ఏర్పాట్లు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రైతుల నుండి 9.57 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం స్వంత నిధులతో రూ.4,000 కోట్ల వ్యయంతో మొక్కజొన్న కొనుగోలు చేపట్టిందని వివరించారు. అదేవిధంగా, రాష్ట్రంలో సాగవుతున్న జొన్న పంటను కూడా రూ.1,000 కోట్లతో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

సేకరించిన మొక్కజొన్న నిల్వ కోసం మొత్తం 15.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అవసరమవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11.40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉందని, దీంతో ఇంకా 3.29 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం అత్యవసరంగా అవసరమని పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మొత్తం 3 కోట్ల గన్ని బ్యాగులు అవసరమవుతుండగా, ఇప్పటివరకు 2 కోట్ల గన్ని బ్యాగులు సరఫరా చేసినట్లు తెలిపారు. మిగిలిన ఒక కోటి గన్ని బ్యాగులు వెంటనే అందుబాటులోకి తేవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అప్‌లోడింగ్ పాయింట్ల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని చెప్పారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వ ధర మద్దతు పథకం (PSS) పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>