కలం డెస్క్ : సమీప భవిష్యత్తులోనూ, ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను. నాకు ఆ నమ్మకం ఉన్నది.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మా అమ్మను పిలుస్తా.. అంటూ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ధీమాను వ్యక్తం చేశారు. సీఎన్ఎన్ న్యూస్-18 ఇంగ్లీష్ ఛానెల్ కు ఇచ్చిన తాజా ఇంటర్ వ్యూలో తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రమాణ స్వీకారానికి తండ్రిని పిలుస్తారా?.. లేక అన్నను పిలుస్తారా?.. అని పాత్రికేయురాలు పల్లవి ఘోష్ ప్రశ్నించగా… మా అమ్మను ఆహ్వానిస్తాను.. నా భర్తను, నా పిల్లలను కూడా పిలుస్తాను.. అని బదులిచ్చారు. తండ్రిని ఎందుకు పిలవరని అడగ్గా.. తాను రాజకీయాల్లోకి రావడానికి కారణమనే ఆయన అని వివరణ ఇచ్చారు.
రాజకీయాల్లో నాకు ఇద్దరే ఆదర్శం :
రాజకీయాల్లో తనకు నచ్చింది, ఆదర్శంగా తీసుకునేది ఇద్దరినేనని, అందులో ఒకరు తన తండ్రి కేసీఆర్ కాగా, మరొకరు మార్గరెట్ థాచర్ అని కవిత పేర్కొన్నారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని మార్గరెట్ థాచర్ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. తన తం్రి కేసీఆర్ లేకపోతే తాను రాజకీయాల్లోకే వచ్చేదాన్ని కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా పార్టీ పెట్టిన తర్వాత దాదాపు ఇరవై ఏండ్లు ఆయనతో కలిసి నడిచానని అన్నారు. దురదృష్టవశాత్తూ ఏ ఆడబిడ్డకూ రానన్ని అవమానాలు తనకు బీఆర్ఎస్ లో వచ్చాయన్నారు. ఊహకు అందని విధంగా ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యాయనని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు వివరణ ఇచ్చే అవకాశం కూడా రాలేదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ లాగానే బీఆర్ఎస్ కూడా :
కాంగ్రెస్, బీజేపీలు తనకు రాజకీయ ప్రత్యర్థులని, అదే తరహాలో బీఆర్ఎస్ కూడా ఉంటుందన్నారు. ఈ మూడు పార్టీలనూ తాను ఒకేలా చూస్తానని అన్నారు. కొత్త రాజకీయ పార్టీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ అవమానాలు ఎదుర్కొన్న తాను వాటిని ఛాలెంజ్ గా తీసుకుని రాణిస్తానని, ఆ ధైర్యం ఉన్నదన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం కవితను సస్పెండ్ చేసినా కేసీఆర్(KCR) ను పల్లెత్తు మాట అనకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కవిత(Kalvakuntla Kavitha)… ఆయనే అధ్యక్షుడిగా ఉన్న పార్టీని మాత్రం రాజకీయంగా ప్రత్యర్ధిగానే చూస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో తాను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తల్లిని ఆహ్వానిస్తానని చెప్పారే తప్ప తండ్రిని పిలవడంపై మాత్రం స్పష్టత ఇవ్వకుండా దాటవేశారు.

