కలం, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ హవాలా స్కామ్ (Hawala Scam) బయటపడింది. రూ.10వేల నుంచి రూ.12వేల జీతంతో పనిచేసే ఓ ర్యాపిడో డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.300 కోట్ల మేర లావాదేవీలు జరగడంపై ఈడీ (ED) చేసిన దర్యాప్తులో ఇది వెలుగుచూసింది. దీని వెనక భారీ క్రికెట్ బెట్టింగ్, హవాలా మార్కెట్ ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది.
పోలీసులు, ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రదీప్ ఓడే ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని బ్యాంకు అకౌంట్లో తరచూ భారీ మొత్తంలో నగదు జమ, బదిలీ అవుతుండడంపై అధికారులకు అనుమానమొచ్చింది. దీనిపై దర్యాప్తు చేయగా, ప్రదీప్ తన బ్యాంక్ అకౌంట్‌ను కిరణ్ పరమార్ అనే వ్యక్తికి నెలకు రూ.25వేలకు అద్దెకు ఇచ్చినట్లు తేలింది. అలాగే, ప్రతి చెక్‌పై సంతకం పెట్టినందుకు రూ.400 ఇచ్చేవాళ్లని అధికారులకు చెప్పాడు.
దీనిపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. ప్రదీప్ అకౌంట్‌ను ఓ ఆర్థిక నేర ముఠా అక్రమ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలకు, స్టాక్ మార్కెట్లో తప్పుడు లావాదేవీలుకు వాడినట్లు గుర్తించారు. ప్రదీప్ ఖడే వివరాలతో ప్రదీప్ ఎంటర్ప్రైజెస్, కమ్లేశ్ ట్రేడింగ్, రౌనక్ ట్రేడర్స్ అనే మూడు కంపెనీలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి 2024లో ఏర్పాటుకాగా, వాటిలో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని తేల్చారు. అయితే, వాటి బ్యాంకు ఖాతాల్లో రూ.550కోట్ల మేర డిపాజిట్లు నమోదయ్యాయి. ఇందులో నుంచి రూ.80.50కోట్లు, రూ.52.11కోట్లు, రూ.22.86 కోట్లు వేరే కంపెనీలకు బదిలీ అయ్యాయి.
అదనంగా స్టాక్ మార్కెట్లో సర్క్యులర్ ట్రేడింగ్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. ఇది షేర్ ధరలను ప్రభావితం చేసే పద్ధతి. పెన్నీ స్టాక్స్ లావాదేవీలు, అలాగే ‘ఇంపాక్ట్ గురు’ ద్వారా అనుమానాస్పద విరాళాల చెల్లింపులు జరిగినట్లు కూడా తేలింది. దీంతో అనేక మార్గాల ద్వారా అక్రమ డబ్బును (Hawala Scam) చట్టబద్ధంగా చూపించే ప్రయత్నం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దీని వెనక భారీ స్థాయిలో పెద్దతలకాయలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Read Also: కాసులు కురిపిస్తున్న ‘స్లమ్‘ టూరిజం.. పేదరికం చూపిస్తే 2 గంటలకే రూ. 15,000!
Follow Us On: X(Twitter)

