కలం, వెబ్ డెస్క్: టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup) సెమీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలిందా? సెమీస్ నుంచి భారత బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson)ను ఐసీసీ (ICC) బ్యాన్ చేసిందా? ప్రస్తుతం సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న చర్చలివే. వెస్టిండీస్‌తో మ్యాచ్ తర్వాత సంజూ సెలబ్రేషన్స్ కారణంగానే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని కొందరంటే, మరికొందరు మ్యాచ్ తర్వాత మైదానంలోనే సంజూ ప్రేయర్ చేయడం వల్లే ఐసీసీ అతడిపై బ్యాన్ వేటు వేయాలని నిర్ణయించుకుందని మరో వర్గం వాదిస్తుంది. అసలు నిజంగా ఒక బ్యాటర్‌ను ఐసీసీ బ్యాన్ చేస్తుందా? చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో చేస్తుంది? సంజూ శాంసన్, సెమీఫైనల్ ఆడుతారా లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మైదానంలో అతను చేసిన ఒక పని ఇప్పుడు ఐసీసీ నిబంధనల ఉచ్చులో పడేలా కనిపిస్తోంది.
అసలు విషయం ఏంటంటే..
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) ఫోర్ కొట్టి భారత్‌ను గెలిపించారు. ఆ వెంటనే ఉద్వేగానికి లోనైన ఆయన, తన హెల్మెట్‌ను తీసి నేలకు విసిరేశారు. ఆ తర్వాత మోకాళ్లపై నిలబడి దైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ విజయం తనకు ఎంతో ప్రత్యేకమైనదని, తన నమ్మకాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని భావిస్తానని ఆయన తర్వాత ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే, సంజూ హెల్మెట్ విసిరేయడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, ఆర్టికల్ 2.2 కింద క్రికెట్ పరికరాలను దుర్వినియోగం చేయడం నేరం. హెల్మెట్లు, బ్యాట్లు లేదా స్టంప్స్‌ను ఉద్దేశపూర్వకంగా విసిరినా, లేదా అజాగ్రత్తగా పడేసినా అది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. గత నెల ఫిబ్రవరి 18న స్కాట్లాండ్ ఆటగాడు జార్జ్ మున్సీ కూడా ఇలాగే హెల్మెట్ విసిరినందుకు ఒక డీమెరిట్ పాయింట్‌ను శిక్షగా పొందారు.
బ్యాన్‌కు అవకాశమెంత?
మరి సంజూపై నిషేధం విధిస్తారా అంటే.. సాధారణంగా ఇలాంటి పనులను లెవల్-1 నేరంగా పరిగణిస్తారు. దీనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. కానీ, 24 నెలల కాలంలో ఒక ప్లేయర్ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు చేరితేనే నిషేధం విధిస్తారు. గతంలో హర్మన్‌ప్రీత్ కౌర్ విషయంలో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేయడం వల్ల ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. ప్రస్తుతానికి సంజూపై ఐసీసీ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో భారత్ సెమీఫైనల్ తలపడనుంది. ఈ కీలక మ్యాచ్ సమయానికి ఐసీసీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Read Also: ట్రంప్, నెతన్యాహు, ఖమేనీ.. ముగ్గురికీ సంబంధమేంటో తెలుసా?
Follow Us On: Youtube

