కలం, కరీంనగర్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బతుకమ్మ పండుగ.. ఆడబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు (Velichala Rajender Rao) ఆకాంక్షించారు. సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) పండుగను పురస్కరించుకుని కరీంనగర్ నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో మహిళలు ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ జీవన విధానానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుతూ మహిళల ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ వేడుకలు తెలంగాణకు గర్వకారణమని అన్నారు.సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆడబిడ్డలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే బతుకమ్మ పండుగ వైభవాన్ని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని వెలిచాల రాజేందర్రావు పిలుపునిచ్చారు.

