కలం, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) హోళీ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. గుంటూరు మిర్చి (Guntur chilli)కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ కీలక సూచనలు చేశారు. భారతదేశం రంగుల దేశమని, దేశంలో రంగులను అనేక రకాలుగా చూడగలమని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో కోసిన మిరపను పొలాల్లో వేసిన తర్వాత పై నుంచి చూసినప్పుడు అది అద్భుతమైన చిత్రకళలా కనిపిస్తుందన్నారు. గుంటూరు జిల్లా దేశంలో మొత్తం మిరప ఉత్పత్తిలో 15% వాటా కలిగి ఉందని తెలిపారు. ఈ అందమైన దృశ్యాన్ని నేల మీద ఉండి చూడటం సాధ్యం కాకపోవచ్చని చెప్పారు. బెలూన్ రైడ్స్, స్థానిక సంగీతం, నృత్య ప్రదర్శనలు నిర్వహించి దీన్ని ఒక పండుగలా మార్చి ఈ సీజనల్ పంటను పర్యాటక ఆకర్షణగా మార్చవచ్చని సూచించారు.
ఇలాంటి పద్ధతులు రైతులు, స్థానికుల ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని, కానీ పర్యాటకుల వల్ల వ్యవసాయ కార్యకలాపాలకు నష్టం రాకుండా జాగ్రత్తగా ప్లానింగ్ చేయాలని ఆయన సూచించారు. ఆనంద్ మహీంద్రా ఈ పోస్టులో మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేసి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టి పెట్టాలని కోరారు. ఈ ఆలోచనతో గుంటూరు మిరప పొలాలను కొత్త పర్యాటక ఆకర్షణగా మార్చే అవకాశం ఉంది.
మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) దీనిపై స్పందించారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ ఆనంద్ జీ అంటూ ఆయన సూచనలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రంగుల దృశ్యాన్ని పర్యాటక ఆకర్షణగా మార్చే మార్గాలను పరిశీలించడానికి పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌కు సూచిస్తామన్నారు. ఆకాశం నుండి చూసే ఈ అందమైన దృశ్యం వెనుక వందలాది రైతుల కృషి, అలాగే గుంటూరును ప్రపంచ స్థాయిలో మిర్చి ఉత్పత్తి కేంద్రంగా నిలిపిన సంప్రదాయం ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ వీడియోల్లో మహీంద్రా ఆటో ఫ్యాక్టరీ, రక్షణ స్థాపన, ఎయిరోస్పేస్ పార్క్ వంటి ప్రదేశాలను కూడా చూపిస్తే బాగుందని చెప్పారు.

