కలం, వెబ్ డెస్క్: గతేడాది వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఖాతాలో మరో ఘనత చేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ ప్రతిష్టాత్మక ‘లారస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు(Laureus Award) నామినేట్ అయ్యింది. ఈ మేరకు ‘లారస్ స్పోర్ట్స్’ సంస్థ మంగళవారం వెల్లడించింది. కాగా, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక క్రీడా అవార్డుల్లో ఒకటైన ఈ పురస్కారానికి నామినేట్ అయిన మొదటి మహిళల క్రికెట్ జట్టుగా భారత్ రికార్డుకెక్కింది.
కోట్లాది భారతీయుల కలలను నిజం చేస్తూ నిరుడు ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్–2025 ట్రోఫీని భారత మహిళల జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 2న ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టును 52 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని దేశానికి అందించింది. తమ అద్భుతమైన ఆటతీరుతో ఈ మెగా ఈవెంట్లో తొలిసారి భారత్ విజేతగా నిలిచింది. టోర్నీ మొత్తం భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు మన జట్టు ప్రతిభకు గుర్తింపుగా లారస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ కావడం మరో గొప్ప గుర్తింపు.
కాగా, స్పెయిన్‌కు చెందిన లారస్ స్పోర్ట్స్ క్రీడా సంస్థ 2000 సంవత్సరం నుంచి ఏటా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జట్లకు ఈ అవార్డు అందిస్తోంది. ఫుట్‌బాల్, బేస్‌బాల్, గోల్ఫ్, ఫార్ములావన్, రగ్బీ వంటి క్రీడాంశాల్లో ఇప్పటివరకు చాలా జట్లు ఈ అవార్డు అందుకున్నాయి. అలాగే క్రికెట్లో ఒకే ఒక్క జట్టు ఈ అవార్డు అందుకుంది. వరుసగా 16 టెస్ట్ మ్యాచ్‌ల్లో విజయం సాధించినందుకు గాను 2002లో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు ఈ పురస్కారం దక్కించుకుంది. అలాగే ఆస్ట్రేలియా మెన్స్ క్రికెట్ టీమ్ మరో రెండు సార్లు, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఒకసారి ఈ అవార్డుకు నామినేట్ అయ్యాయి. ఇక, మహిళల క్రికెట్ విభాగంలో నామినేట్ అయిన ఘనత భారత్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌ది మాత్రమే. అవార్డు (Laureus Award) గెలిస్తే ఇదొక రికార్డుగా నిలిచిపోతుంది.
Read Also: మా ఊరికి రోడ్డు వేయండి సార్.. మోకాళ్లపై కూర్చుని వేడుకున్న చిన్నారులు
Follow Us On : WhatsApp

