epaper
Tuesday, November 18, 2025
epaper

డాలర్ ఢమాల్… గోల్డ్, సిల్వర్ కి భారీ డిమాండ్

కలం డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారత్ లో పదేండ్లలో బంగారం, వెండి ధరలు నాలుగు రెట్ల కంటే ఎక్కువే పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో డాలర్ విలువ పడిపోతూ ఉండడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. దక్షిణాసియాలో పండుగల సీజన్ మొదలుకావడంతో ఈ రెండింటికి డిమాండ్ పెరిగింది. పదేండ్ల క్రితం పది గ్రాముల బంగారం ధర రూ. 25 వేలు ఉంటే, ఇప్పుడు అది రూ. 1.20 లక్షలకు పెరిగింది. వెండి ధర సైతం పదేండ్ల క్రితం రూ. 36 వేలు ఉంటే ఇప్పుడు అది రూ. 1.5 లక్షలకు పెరిగింది.

ధరలపై డాలర్ ఎఫెక్ట్ :

బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఈ రెండూ అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్లలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా విదేశీ మారక ద్రవ్యంగా డాలర్ చెలామణి అవుతున్నది. డాలర్ విలువలో వచ్చే హెచ్చు తగ్గులు ఈ రెండు లోహాల ధరలపై ప్రభావం చూపుతుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు ఇతర దేశాల కరెన్సీ విలువలు పెరుగుతాయి. దీంతో ఆయా దేశాల్లోని ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. గత కొన్ని నెలలుగా డాలర్ విలువ తగ్గుతూ ఉండడంతో ఈ రెండు లోహాల ధరలు పెరుగుతున్నాయి.

వడ్డీ రేట్ల తగ్గింపు సైతం :

ప్రతీ దేశానికి ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంకు ఉంటుంది. భారత్ లో రిజర్వు బ్యాంకు ఉన్నట్లుగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని ఫెడ్ అని పిలుస్తారు. ఆ దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇటీవల వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించింది. దీంతో డాలర్ విలువ తగ్గిపోయింది. అనివార్యంగా బంగారం, వెండి లాంటి విలువైన లోహాల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ రెండింటికీ డిమాండ్ ఏర్పడి ధర మరింత పెరగడానికి దోహదపడింది.

కొవిడ్ తర్వాత మార్పు :

ప్రపంచవ్యాప్తంగా 2020లో కొవిడ్ (కరోనా వైరస్) పరిస్థితి తలెత్తిన తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో బంగారం, వెండి లాంటి రూపాల్లో సంపదను దాచుకోవాలన్న డిమాండ్ పెరిగింది. ఎప్పటికైనా వీటి విలువ తగ్గదనే ఉద్దేశంతో అటు పొదుపు కోసం, ఇటు భవిష్యత్తు అవసరాల కోసం బంగారం, వెండిని కొనుగోలు చేయడం పెరిగింది. అందుకే వీటిని సేఫ్ హెవెన్ అస్సెట్స్ గా గుర్తించడం పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక ఔన్స్ (31 గ్రాములు) బంగారం ధర 3,800 డాలర్లకు పెరిగింది. వెండి సైతం ఔన్సు ధర 43 డాలర్లకు చేరుకుంది. అటు డాలర్ విలువ బలహీన పడడం, అంతర్జాతీయ మార్కెట్ లో ఈ రెండు లోహాల డిమాండ్ పెరగడంతో ధరలు సైతం రోజురోజుకూ పెరుగుతున్నాయి.

అశాంతి, యుద్ధాలు కారణం :

పలు దేశాల మధ్య తలెత్తిన భౌతిక ఘర్షణలు, భౌగోళిక ఉద్రిక్తతలు ఈ రెండు లోహాల ధరలు పెరగడానికి, వివిధ కరెన్సీల విలువ తగ్గడానికి దారితీశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా-ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్యంలో పోటీ, మిడిల్ ఈస్ట్ దేశాల (మధ్యప్రాచ్యం) మధ్య ఉద్రిక్తతలు.. ఇలాంటివన్నీ పెట్టుబడిదారులను బంగారం, వెండి క్రయ విక్రయాలవైపు మళ్ళించాయి.

గ్రీన్ ఎనర్జీతో సిల్వర్ కు డిమాండ్ :

బంగారంతో పోలిస్తే వెండి ధర పెరుగుదల ఎప్పుడైనా తక్కువే ఉంటుంది. కానీ రెండేండ్ల నుంచి వెండి ధరలు ఊహకు అందనంతగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరుగుతూ ఉండడంతో నివారణపై అనేక దేశాలు ప్రత్యేక పాలసీలను తీసుకున్నాయి. ఇందులో భాగంగా పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించి గ్రీన్ ఎనర్జీ (బ్యాటరీ) వాహనాలను ప్రోత్సహించాలనే విధాన నిర్ణయాన్ని తీసుకున్నాయి. సంప్రదాయ ఇంధన వనరులైన (థర్మల్) లాంటి వాటి స్థానంలో సోలార్, విండ్ లాంటివాటిపై దృష్టి పెట్టాయి. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగంలో సోలార్ ప్యానెళ్ళది కీలక భూమిక. దీంతో వాటిని తయారు చేయడానికి వెండిని వాడడం తప్పనిసరి. ఒకవైపు ఉత్పత్తి కోసం సోలార్ ప్యానెళ్ళు, మరోవైపు ఇంధనాన్ని నిల్వ చేయడానికి బ్యాటరీ స్టోరేజీ తప్పనిసరి కావడంతో వాటిల్లో వెండి వినియోగం పెరిగింది. ఈ అవసరాల రీత్యా వెండికి డిమాండ్ పెరిగింది. ధరలు కూడా అదే రీతిలో పెరిగాయి.

భారత్‌లో వెండి ధరలు :

భారతదేశంలో గడచిన పదేండ్లో వెండి ధరలను పరిశీలిస్తే డిమాండ్, ధర ఏ మేరకు పెరిగిందో అర్థమవుతుంది. ఇండియన్ మార్కెట్ లో కిలో వెండి ధర (కిలో) ఏటేటా ఎలా పెరుగుతూ (రూ.లలో) ఉన్నదో అర్థమవుతుంది.
2015లో – రూ. 36,500
2016లో – రూ. 41,200
2017లో – రూ. 39,800
2018లో – రూ. 38,100
2019లో – రూ. 45,600
2020లో – రూ. 63,400
2021లో – రూ. 61,200
2022లో – రూ. 59,080
2023లో రూ. 73,300
2024లో – రూ.85,700
2025లో (సెప్టెంబరు) – రూ. 1.50 లక్షలు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>