కలం, వరంగల్ బ్యూరో : వరంగల్(Warangal) జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. తండ్రి ఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో ఓ మైనర్ బాలిక (Minor Girl) ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మిల్స్ కాలనీ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా (Odisha) రాష్ట్రంలోని కలహండి ప్రాంతానికి చెందిన భారత్ తన కుటుంబంతో కలిసి వరంగల్ శివారు అమ్మవారిపేటలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.
ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడో కుమార్తె ఇటీవల మొబైల్ ఫోన్ కొనివ్వాలని తండ్రిని కోరింది. దానికి భారత్ తర్వాత కొనిస్తాను అని చెప్పడంతో బాలిక మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్పందించినప్పటికీ.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

