epaper
Sunday, March 1, 2026
epaper

భయంలేని ఆట కొనసాగిస్తాం : తిలక్ వర్మ

కలం, వెబ్​ డెస్క్​: వెస్టిండీస్‌పై (West Indies) కూడా అటాక్ మోడ్‌లోనే చెలరేగుతామని టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) వ్యాఖ్యానించాడు. జింబాబ్వేపై సాధించిన భారీ విజయం ఇచ్చిన ఊపుతో సెమీస్ బెర్తుపై భారత్ ధీమాగా ఉంది. జింబాబ్వేపై 72 పరుగుల భారీ విజయం సాధించిన అనంతరం తిలక్ వర్మ జట్టు వ్యూహాలను వెల్లడించాడు. తాము గతేడాది కాలంగా భయం లేని క్రికెట్ ఆడుతున్నామని, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోనూ అదే తీవ్రతను చూపిస్తామని చెప్పాడు.

ప్రత్యర్థి బౌలర్ల మనసులో భయం పుట్టించేలా ప్రతి బంతిని బాదడానికి తాము సిద్ధంగా ఉన్నామని తిలక్​ పేర్కొన్నాడు. ప్రస్తుతం గ్రూప్-1లో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. వెస్టిండీస్ కూడా గత మ్యాచ్‌లో 254 పరుగులు చేసిన విషయాన్ని తిలక్ గుర్తు చేశాడు. పిచ్ అనుకూలించకపోయినా పరిస్థితులకు తగ్గట్లు సర్దుబాటు చేసుకుంటూ తమ అటాకింగ్ గేమ్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశాడు.

జింబాబ్వేతో చెన్నై వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ విధ్వంసకర బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 55 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. మొత్తం 256 పరుగులు చేసిన భారత్, టీ20 ప్రపంచకప్ (T20 World Cup) చరిత్రలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఈ భారీ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు, 17 ఫోర్లు ఉండటం భారత బ్యాటర్ల పవర్ హిట్టింగ్‌కు నిదర్శనం. తిలక్ వర్మ(Tilak Varma) కేవలం 19 బంతుల్లో 44 పరుగులు చేసి పాండ్యాతో కలిసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవేళ పవర్‌ప్లేలో మూడు నాలుగు వికెట్లు పడినా, అదే దూకుడైన లయతో బ్యాటింగ్ చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు తిలక్ తెలిపాడు. ఓపెనర్లు శుభారంభం ఇస్తే ఆ ఆత్మవిశ్వాసం మిగతా బ్యాటర్లకు బలాన్నిస్తుందని అభిప్రాయపడ్డాడు.

Read Also : లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!