కలం, వెబ్ డెస్క్: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల (UN Human Rights) ప్రధాన అధికారి వోల్కర్ టర్క్ (Volker Turk) అఫ్గానిస్తాన్‌లో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కులు సమాధి అయ్యాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. అఫ్గానిస్తాన్‌లో (Afghanistan) మహిళలు, బాలికలు తీవ్ర లింగ వివక్షను, అణచివేతను ఎదుర్కొంటున్నారన్నారు. వేధింపులు, హింస, హక్కుల హరించడం తారాస్థాయికి చేరుకుందని మండిపడ్డారు. అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలు మహిళలను సమాజం నుంచి పూర్తిగా వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.
బాలికలకు ఉన్నత విద్యపై నిషేధం విధించడం, ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం లేకపోవడం, బయటకు వెళ్లేటప్పుడు కఠిన నియమాలు, పురుష సంరక్షకుడు లేకుండా ప్రయాణంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు మహిళల ప్రాథమిక హక్కులను దూరం చేస్తున్నాయని తెలిపారు. అఫ్గానిస్తాన్ పరిస్థితులు “అపార్థెయిడ్” విధానాన్ని గుర్తు చేస్తున్నాయని వోల్కర్ (Volker Turk) వ్యాఖ్యానించారు. కేవలం పౌరుల జెండర్ ఆధారంగా వివక్ష చూపుతున్నారని స్పష్టం చేశారు. అపార్థెయిడ్ అంటే ఒక వర్గాన్ని పూర్తిగా వేరుచేసి, వారికి సమాన హక్కులు ఇవ్వకుండా ఉంచే విధానం. అలా మహిళలను సమాజం నుంచి దూరం చేసి, వారి స్వేచ్ఛను పరిమితం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.
Read Also: బెంగళూరులో పొలిటికల్ హీట్: డీకే వర్గం ఎమ్మెల్యేల రహస్య భేటీ !
Follow Us On: X(Twitter)

