కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 45 మంది ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేయడం సచివాలయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను (Arvind Kumar) రెవెన్యూ శాఖలోని విపత్తు నిర్వహణ విభాగం స్పెషల్ సీఎస్ బాధ్యతల నుంచి తొలగించి ఏ పోస్టూ ఇవ్వకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు (Formula E-Car Race) కేసులో ఆయన ఏ-2గా ఉన్నారు. ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర డీవోపీటీ (DoPT) ఇటీవలే అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు ఆయనను బాధ్యతల నుంచి తప్పించడం గమనార్హం. త్వరలోనే ఆయనను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (Telangana ACB) విచారణకు పిలిచి ప్రశ్నించే అవకాశమున్నది. దీంతో ఆయన ప్రాసిక్యూషన్‌కు సిద్ధమవుతున్నదనే సంకేతాలు వెలువడినట్లయింది. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత కోర్టుకు చార్జిషీట్ సమర్పించనున్నది.
ఫిర్యాదు చేసిన అధికారికే బాధ్యతలు :
ఫార్ములా కార్ రేస్ (Formula E-Car Race) కేసులో అరవింద్ కుమార్‌కు వ్యతిరేకంగా మరో ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్ అప్పట్లో ఫిర్యాదు చేశారు. అరవింద్ కుమార్ పురపాలక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే ఈ అవకతవకలు జరిగినట్లు ఆ ఫిర్యాదులో దానకిషోర్ పేర్కొన్నారు. దాని ఆధారంగానే ఏసీబీ కేసు నమోదు చేసింది. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీల్లో అరవింద్ కుమార్‌కు ఉన్న ఏకైక బాధ్యత నుంచి తప్పించడంతో పాటు ఆ బాధ్యతలను దానకిషోర్‌కే అప్పగించడం విశేషం. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ తరచూ విమర్శలు చేస్తున్నారు. ఐఏఎస్ అరవింద్‌ను బాధ్యతల నుంచి తప్పించడంతో ఏసీబీ ప్రాసిక్యూషన్ తర్వాత ఆ కేసులో ఏ-1గా ఉన్న కేటీఆర్‌కు ఎలాంటి చిక్కులొస్తాయోననే చర్చ కూడా మొదలైంది. అరవింద్ కుమార్‌ను వెయిటింగ్‌లో పెట్టిందే ఆయనను ప్రాసిక్యూట్ చేయడం కోసం అనేది సచివాలయ వర్గాల సమాచారం.
బడ్జెట్ సెషన్ నాటికి హాట్ టాపిక్‌గా…
ఫార్ములా కార్ రేసులో అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్, దాని తర్వాత జరిగే పరిణామాలు బడ్జెట్ సెషన్ నాటికి హాట్ టాపిక్‌గా మారే అవకాశమున్నది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీఆర్ఎస్ సమాయత్తం కావడానికి వీల్లేకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కేడర్ ఫోకస్ అంతా ఫార్ములా కార్ రేసుపైకి వెళ్ళే అవకాశాలున్నాయి. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌తో బీఆర్ఎస్ నేతల్లో సరికొత్త గుబులు మొదలవుతుందన్నది ఆ పార్టీ కేడర్‌లోని అభిప్రాయం. అసెంబ్లీ సెషన్‌కు ఇంకా రెండు వారాలకు పైగా టైమ్ ఉండడంతో ఈ లోపు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది కీలకం.
Read Also: ఒక్కసారి నా ఇల్లు చూసుకుంటా.. ఖమ్మం ఇళ్ల కూల్చివేతల్లో మహిళ ఆవేదన
Follow Us On: Youtube

