కలం, వెబ్ డెస్క్ : ఒడిశా (Odisha) రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో, ఏకంగా కోట్ల రూపాయల నగదు గుట్టలుగా పడి ఉండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కట్టక్ మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేబబ్రత మొహంతిని లక్ష్యంగా చేసుకుని విజిలెన్స్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.
లంచం కేసుతో మొదలైన ఈ సోదాలు, ఆయన నివాసంలో బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అధికారులు చూసి విస్మయానికి గురయ్యారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో, స్వాధీనం చేసుకున్న సొమ్ము విలువ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒడిశా (Odisha) విజిలెన్స్ చరిత్రలోనే ఒక ప్రభుత్వ అధికారి నుంచి ఇంత భారీ స్థాయిలో నగదును పట్టుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ బృందం, ఈ అక్రమ ఆస్తుల వెనుక ఉన్న ఇతర మూలాలను కూడా ఆరా తీస్తోంది.

