epaper
Sunday, March 1, 2026
epaper

చీఫ్ సెక్రటరీకి నో ఎక్స్ టెన్షన్.. సీఎం ఛాయిస్‌పై సస్పెన్స్

కలం, తెలంగాణ బ్యూరో : ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) స్థానంలో కొత్తగా వచ్చేది ఎవరనేది సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన ఇప్పటికే రిటైర్ అయినా ముఖ్యమంత్రి విజ్ఞప్తితో వచ్చే నెల చివరి వరకు ఎక్స్ టెన్షన్ వచ్చింది. ఆ తర్వాత మరోసారి పొడిగింపు ఉండకపోవచ్చనే చర్చలూ జరుగుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 30 వరకు జరిగేలా క్యాబినెట్ షెడ్యూలు ఫిక్స్ చేసింది. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే కొత్త చీఫ్ సెక్రటరీ (New Chief Secretary) రానున్నారు. సీనియారిటీ ప్రకారం వికాస్ రాజ్‌ (Vikas Raj IAS), సంజయ్ జాజు (Sanjay Jaju), జయేశ్ రంజన్ (Jayesh Ranjan) తదితరులు ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి ఆప్షన్ ఎవరికనేది కీలకంగా మారింది. ముగ్గురూ తెలంగాణేతరులే. ఈ ముగ్గురూ 1992 బ్యాచ్‌కు చెందినవారే. ఏజ్ రీత్యా చూస్తే జయేశ్ రంజన్ వచ్చే ఏడాది సెప్టెంబరులో, వికాస్‌రాజ్ 2028 మార్చి నెలలో, సంజయ్ జాజు 2029 ఫిబ్రవరిలో రిటైర్ కానున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.

రాష్ట్ర అవసరాలే లక్ష్యంగా సీఎం ఎంపిక :

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా రామకృష్ణారావు కొనసాగారు. చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆర్థిక అంశాలపై లోతైన అవగాహనతో పాటు దాదాపు పన్నెండేండ్లుగా బడ్జెట్‌లను తయారుచేసిన అనుభవమున్నది. వచ్చే ఏడాది బడ్జెట్ సెషన్ వరకూ ఆయన సేవలను వినియోగించుకునేలా ముఖ్యమంత్రి ఆలోచించి ఎక్స్ టెన్షన్ వచ్చేలా చూశారు. దీంతో తదుపరి చీఫ్ సెక్రటరీ ఎంపిక విషయంలో ఆర్థిక అంశాలను కూడా సీఎం పరిగణనలోకి తీసుకోనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. దాదాపు పుష్కరకాలంగా పరిశ్రమల శాఖకు కార్యదర్శిగా పనిచేసిన జయేశ్ రంజన్‌కు వివిధ బహుళజాతి సంస్థలతో ఉన్న పరిచయాలు పనికొస్తాయన్నది సీఎం భావన. కానీ ఆయనను ఇటీవల మూడు కార్పొరేషన్ల స్పషెల్ ఆఫీసర్‌గా నియమించడంతో సెక్రటేరియట్ కారిడార్‌లో భిన్నమైన చర్చ జరుగుతున్నది.

ఎన్నికల సీజన్ దృష్ట్యా ఆచితూచి నిర్ణయం :

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు కావస్తున్నది. షెడ్యూలు ప్రకారం మరో రెండున్నరేండ్లే ఉన్నందున చివరి సంవత్సరమంతా ఎలక్షన్ ఫీవర్‌లోనే గడచిపోతుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరోసారి పవర్‌లోకి వచ్చేందుకు వీలుగా పరిపాలనను సమర్ధవంతంగా నిర్వహించడం, అదే సమయంలో ఆర్థిక అవసరాలు తీరడం.. ప్రభుత్వ ప్రయారిటీగా ఉన్నాయి. సంక్షేమ పథకాల్లో ఇంకా కొన్నింటిని అమల్లోకి తేవాల్సి ఉన్నందున వాటికి అవసరమైన నిధులను సర్దుబాటు చేయడం, గ్రౌండ్ స్థాయిలో ప్రజలకు పలాలు అందేలా చూడడం.. వీటిని దృష్టిలో పెట్టుకుని చీఫ్ సెక్రటరీ (New Chief Secretary) ఎంపికపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సంజయ్ జాజు పదవీకాలం 2029 వరకు ఉన్నందున సరిగ్గా ఎన్నికల సమయానికి నియమించాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది. కొత్త చీఫ్ సెక్రటరీ అంశంలో వచ్చే నెల బడ్జెట్ సమావేశానికి నాటికి క్లారిటీ రానున్నది.

Read Also: ఫుల్‌టైమ్ డీజీపీ ఎవరు? రేస్‌లో సీవీ ఆనంద్, శిఖా గోయల్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!