కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశలో అదరగొట్టిన టీమ్ ఇండియాకు సూపర్-8లో దక్షిణాఫ్రికా గట్టి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సన్నద్ధతపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్లో జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తూ, జట్టు ప్రిపరేషన్లో లోపాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆకాష్ చోప్రా, భారత జట్టు ఈ మెగా టోర్నీకి తగినంతగా సిద్ధం కాలేదని విశ్లేషించారు.
గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ, ప్రతి మ్యాచ్లోనూ బ్యాటింగ్ విభాగంలో జట్టు తడబాటు స్పష్టంగా కనిపించిందని ఆయన గుర్తు చేశారు. 250 నుంచి 275 పరుగులు చేయాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగిందని, అయితే ప్రపంచకప్ వంటి టోర్నీలలో ఇలాంటి భారీ స్కోర్లు సాధించడం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచకప్ చరిత్రను విశ్లేషిస్తూ ఆకాష్ చోప్రా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇది 10వ టీ20 ప్రపంచకప్ అని, ఇప్పటివరకు అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగిన పోరులో కేవలం 15 సార్లు మాత్రమే 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయని వివరించారు. సెమీఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్లలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 200 పరుగులు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఐపీఎల్లో ప్రతి రెండు ఓవర్లకు ఒక సిక్సర్ నమోదవుతుంటే, ప్రపంచకప్లో మాత్రం ప్రతి 25 బంతులకు ఒక సిక్సర్ మాత్రమే వస్తోందని గణాంకాలతో సహా వివరించారు.
భారత జట్టు ఐపీఎల్ తరహాలో భారీ స్కోర్లు చేయాలని భావించిందని, కానీ ప్రపంచకప్ సవాళ్లను ఎదుర్కోవడంలో పూర్తిస్థాయిలో సిద్ధమవ్వలేదని చోప్రా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టోర్నీ కీలక దశకు చేరుకున్న వేళ, భారత జట్టు తన బ్యాటింగ్ వైఫల్యాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్లలో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.

