కలం, ఆలేరు : యాదగిరిగుట్ట (yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం స్వామివారు జగన్మోహిని అవతార అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి అశ్వవాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని లోకహితం కోసం రాక్షసులకు అందకుండా చేసేందుకు జగన్మోహిని రూపం దాల్చిన శ్రీమహావిష్ణువు సుర, అసురులను సమ్మోహనం చేసి యోగ్యులైన దేవతలకు అమృతాన్ని అందించారు.
ఆలయ ప్రధానార్చకులు శ్రీమాన్ కాండూరు వెంకటాచార్య స్వామి, బట్టర్ సురేంద్రాచార్య స్వామి, ఉప ప్రధాన అర్చకులు మరిగంటి శ్రీధరాచార్యులు, కొడకండ్ల మాధవాచార్యులు, వజ్జల లక్ష్మణాచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి తదితరులు అలంకార సేవలను నిర్వహించి, ఆ విశేషాలను భక్తులకు వివరించారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు.
నేడు రాత్రి స్వామివారి ఎదుర్కోలు
నరసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవలో స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 8:45 గంటలకు స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. బుధవారం ఉదయం హనుమంత వాహన సేవలో శ్రీరామ అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 9 గంటలకు గజవాహన సేవ నిర్వహించిన అనంతరం స్వామివారి తిరుకల్యాణం జరగనుంది.

