కలం, వరంగల్ బ్యూరో : ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం హనుమకొండ (Hanamkonda) కలెక్టరేట్ లో హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, విద్యా, వైద్యారోగ్య, కార్మిక, పోలీస్ అధికారులు, బాలల న్యాయ మండలి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల్లో అనేక సమస్యలు గుర్తించామని.. ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు, టాయిలెట్లు లేవని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదన్నారు. హనుమకొండ, వరంగల్ డీఈవోలు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, ఇమ్యూనైజేషన్ స్టేటస్ వివరాలను అందించాలని హనుమకొండ (Hanamkonda) డీఎంహెచ్ వో డాక్టర్ అప్పయ్యను సీతా దయాకర్ రెడ్డి ఆదేశించారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. బాల్య వివాహాలు చేసే కుటుంబాలను ముందుగానే గుర్తించి వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. బాల్య వివాహాలపై నివేదికను అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారులకు సీతా తెలియజేశారు. త్వరలో బాల్య వివాహ నిషేధ చట్టంపై, బాల్య వివాహాల నిర్మూలనపై, పోక్సో చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో బాలల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా వారి మానసిక వికాస స్థాయిలను గుర్తించి అవసరమైన వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, బండి అపర్ణ, కంచర్ల వందన గౌడ్, వచన్ కుమార్, ప్రేమలత అగర్వాల్, డీఆర్వో వైవీ గణేష్, ఆర్జేడీ ఝాన్సీ లక్ష్మీ బాయి , జిల్లా సంక్షేమ అధికారులు విశ్వజ, మల్లీశ్వరి, డిఎంహెచ్ వోలు డాక్టర్ అప్పయ్య, డాక్టర్ సాంబశివరావు, అడిషనల్ డీసీపీ ఎన్ రవి, భూపాలపల్లి ఆడిషనల్ ఎస్పీ నరేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ లు అనిల్ చందర్ రావు, వసుధ, బాలల న్యాయ మండలి సభ్యులు డాక్టర్ కే గోపికా రాణి, ఎం సుభాష్, ఇంచార్జి డిసిపివోలు ఎస్ ప్రవీణ్ కుమార్, ఉమ, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ భాస్కర్, జి తిరుపతి, కార్మిక శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


