epaper
Sunday, February 22, 2026
epaper

ఏఐ రంగానికి భారత్ దిక్సూచి: ప్రధాని మోదీ

కలం, వెబ్​ డెస్క్​ : ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రతిష్ఠాత్మకమైన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారత్ కేవలం సాంకేతికతను అందిపుచ్చుకోవడమే కాకుండా, ప్రపంచ ఏఐ రంగానికి దిక్సూచిగా మారుతోందని స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సుగా నిలిచిన ఈ వేదిక భారతీయ సృజనాత్మకతకు, మేడిన్ ఇండియా శక్తికి నిదర్శనమని ప్రధాని కొనియాడారు. ఈ సదస్సు కేవలం మన దేశానికే కాకుండా మొత్తం దక్షిణ ఆసియాకే గర్వకారణమని ఆయన తెలిపారు. ప్రపంచ జనాభాలో ఆరో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్, తన అపారమైన యువశక్తితో టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ ప్రారంభ దశలో అనేక అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, నేడు యువత దీనిని అత్యంత ప్రయోజనకరంగా మలుచుకుంటూ మానవ సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తోందని ప్రశంసించారు.

సాంకేతికతను శాసించాల్సింది మనమేనని గుర్తు చేస్తూ, గతంలో అణుశక్తి ద్వారా ఎదురైన సవాళ్లను ప్రధాని మోదీ (Narendra Modi) ప్రస్తావించారు. ఏఐని కూడా విధ్వంసానికి కాకుండా సామాజిక శ్రేయస్సు కోసం, అన్ని రంగాల్లోని సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేస్తుందనే ఆందోళన కంటే, ప్రస్తుతం మనం ఏఐతో ఏం సాధిస్తున్నామన్నదే ముఖ్యమని మోదీ పేర్కొన్నారు. భారత్ ప్రస్తుతం స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీకి గ్లోబల్ హబ్‌గా మారుతోందని, ఏఐని మనం అనుసరించడం కాదు, మనమే దానిని శాసించే స్థాయికి చేరుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>