కలం, వెబ్ డెస్క్: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థలో గ్రీన్‌ఎనర్జీని (Green Energy) ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈవీల తయారీ కోసం చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా పంప్‌సెట్‌లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఈ శక్తిని బొగ్గు, సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
పట్టణాభివృద్ధిలో భాగంగా తాము కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)లో దాదాపు పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొని ప్రసంగించారు. బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో దేశంలోని పట్టణాలు, నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి తెలంగాణ దృక్పథాన్ని వివరించారు.
ఈ సదస్సులో మాట్లాడటం సంతోషంగా ఉంది
పట్టణాభివృద్ధికి సంబంధించిన సదస్సులో మాట్లాడడం తనకు సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నుంచి భారత అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రం అనంతరం తొలి నాలుగు దశాబ్దాల్లో దేశంలో ప్రధాన ప్రాధాన్యతలు విద్యా వ్యవస్థ, నీటిపారుదల రంగాలేనని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాథమిక పాఠశాలల నుంచి IIT, IIM, IISC వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యుత్, సాగునీటికి భారీ ఆనకట్టలను నిర్మించి రైతుల పొలాలను నీటితో అనుసంధానించామని తెలిపారు. 1990 నాటికి భారత్ ఆహార కొరత నుంచి ఆహార భద్రత సాధించిందని చెప్పారు. దీంతో ప్రజల జీవిత కాలం పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు.
శక్తివంతమైన దేశంగా భారత్
దేశంలోని ఇంజినీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి సాధించిందని వివరించారు. 1991 నుంచి 2020 వరకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG) సంస్కరణలతో భారత్ సేవా రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని సీఎం వివరించారు. టెలికాం , సాఫ్ట్‌వేర్ విప్లవంతో పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ సాధ్యమైందని అన్నారు. భారత నిపుణులు సిలికాన్ వ్యాలీ వంటి ప్రపంచ కేంద్రాల్లో విజయాలు సాధించారని తెలిపారు. 1991 తర్వాత గ్లోబల్ సాఫ్ట్ వేర్, టెక్ సంస్థలు తమ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు భారత్‌ను ఎంచుకున్నాయని అన్నారు. అందుకే ప్రపంచంలో అత్యధిక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCs) మన దేశంలో ఉన్నాయన్నారు. ఈ టెక్ పురోగతిలో తయారీ రంగం ఎక్కువగా అవకాశాలు కోల్పోయినట్లు అభిప్రాయపడ్డారు.
కొవిడ్ తర్వాత మారిన ప్రభుత్వాల దృష్టికోణం
కోవిడ్ అనంతరం ప్రభుత్వాల దృష్టికోణం మారిందని ముఖ్యమంత్రి (Revanth Reddy) స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని అన్నారు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను CURE, PURE, RARE జోన్‌లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
హైదరాబాద్‌ను 160 కి.మీ. పొడవైన ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)గా ప్రకటించగా, ORR, 360 కి.మీ.ల రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతాన్ని PURE జోన్‌గా రూపొందించి తయారీ రంగానికి నిర్దేశించినట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి “చైనా +1” ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ తయారీ వృద్ధి గ్రీన్ ఎనర్జీ ఆధారంగా సాగుతుందని స్పష్టం చేశారు.
గ్రీన్ సోర్సుల నుంచి తెలంగాణకు విద్యుత్
తెలంగాణ విద్యుత్ వినియోగంపై ముఖ్యమంత్రి గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రం రోజుకు సగటున 16,610 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తోందని తెలిపారు. గత ఏడాది గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లు నమోదైందని, ఈ ఏడాది అది 19,000 మెగావాట్లను దాటుతుందని అంచనాలున్నాయని వివరించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో గరిష్ట డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 24.8% లేదా దాదాపు 25% గ్రీన్ సోర్సుల నుంచే వస్తోందని తెలిపారు. అదేవిధంగా, 360 కిలోమీటర్ల పొడవు గల రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కొనసాగుతోందని, రీజినల్ రింగ్ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు.. ORR, RRR మధ్య ప్రాంతాన్ని ప్రధాన తయారీ జోన్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమంలో వనరుల పెరుగుదలలో ప్రధాన భాగం గ్రీన్‌గా ఉండాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, కోవిడ్ ప్రభావాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితిని క్లైమేట్ ఎమర్జెన్సీగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి సృష్టి, ఉత్పత్తి , వినియోగం పెంపు కొనసాగుతూనే పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఈవీల తయారీకి ఏర్పాట్లు
తెలంగాణ మూడు జోన్‌లలో గ్రీన్ స్ట్రాటజీని అవలంబించిందని చెప్పారు. హైదరాబాద్ CURE ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలో అత్యధికంగా EVల స్వీకరణ పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలోనే EV తయారీ కోసం సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణహితంగా మార్చే దిశగా 2 లక్షలకుపైగా ఆటోరిక్షాలను రీట్రోఫిట్ చేస్తుండగా, 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మెట్రోను ప్రస్తుత 71 కి.మీ. నుంచి 200 కి.మీ. పైగా విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్‌లకు తరలిస్తున్నామన్నారు.
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. హైడ్రా (HYDRAA) రూపంలో పర్యావరణ రక్షణకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణ ప్రమాదాలను తగ్గించి నగరాన్ని సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందే నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
Read Also: బ్లింకిట్‌పై కేసు నమోదు.. ఆ ఆర్డర్ వల్లే
Follow Us On : WhatsApp


