కలం, వెబ్ డెస్క్ : ఆకర్షణీయమైన ప్యాకెట్లు చూసి మనం కొనే ఆహారం ఎంత నాణ్యమైనదో అని మురిసిపోతుంటాం. కానీ ఆ రంగురంగుల కవర్ల వెనుక దాగి ఉన్న అసలు రూపం చూస్తే గుండె జారిపోవాల్సిందే. ఇటీవల వెలుగులోకి వస్తున్న కొన్ని దృశ్యాలు చూస్తుంటే మనం తినే అటుకులు (పొహా) ఎంత అపరిశుభ్రమైన వాతావరణంలో ప్యాక్ అవుతున్నాయో అర్థమవుతోంది. కనీస శుభ్రత పాటించకుండా, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను ప్యాకింగ్ (Food Packaging) చేయడం వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
నిజానికి ప్యాకింగ్ చూసి అది హై-క్వాలిటీ అని నమ్మి మోసపోతున్నాం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇంత జరుగుతున్నా మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వంటి నియంత్రణ సంస్థలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి కల్తీ, అపరిశుభ్ర వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


