కలం, వెబ్‌డెస్క్: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై (US Trade Deal) కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ‘ఎక్స్’ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఐదు ప్రశ్నలు సంధించారు. తన కోసం కాకపోయినా, భారత రైతుల సంక్షేమం కోసం వీటికి బదులు చెప్పాల్సిందేనన్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్ భారత రైతులను మోసం చేసే ప్రమాదం ఉందని, దేశ వ్యవసాయ రంగం స్వావలంబనకు అడ్డంకిగా మారవచ్చని ఆయన ఆరోపించారు. జన్యుమార్పిడి పంటలు, వాణిజ్యేతర అడ్డంకుల తొలగింపు, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను విస్తృతంగా తెరవడంపై స్పష్టత కోరారు.
‘అమెరికా వాణిజ్య ఒప్పందం పేరుతో భారత రైతులకు జరుగుతున్న విశ్వాసఘాతుకాన్ని మనం చూస్తున్నాం’ అంటూ ఐదు ప్రశ్నలతో ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. అవేంటంటే..
- డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్ (DDG) దిగుమతి అంటే ఏమిటి? భారత్‌లోని పశురంగానికి అమెరికాలో పండిన జన్యుమార్పిడి మొక్కజొన్నతో తయారైన మేతను వేస్తారా? అలా అయితే, మన పాల ఉత్పత్తి అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడే పరిస్థితి వస్తుందా?
- జన్యుమార్పిడి (GM) సోయాబీన్ నూనె దిగుమతికి అనుమతి ఇస్తే.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా సోయాబీన్ రైతుల పరిస్థితి ఏంటి? వాళ్లు ధరల షాక్‌ను ఎలా తట్టుకుంటారు?
- వాణిజ్య ఒప్పందంలో ఉన్న ‘అదనపు ఉత్పత్తులు’ అంటే ఏమిటి? క్రమక్రమంగా అమెరికా నుంచి పప్పుధాన్యాలు, ఇతర పంటలకు భారత మార్కెట్ తెరవాలనే దానికి ఇది సూచనా?
- ట్రేడ్ డీల్ ‘వాణిజ్యేతర అడ్డంకులు’ తొలగించడం అంటే ఏమిటి? భవిష్యత్తులో జన్యుమార్పిడి పంటలపై మన తీరును సడలించడం, కొనుగోలు వ్యవస్థను బలహీనం చేయడం, లేదా కనీస మద్దతు ధర, బోనస్‌లను తగ్గించాలని భారత్‌పై ఒత్తిడి తెస్తారా?
- ఒక్కసారి అమెరికా ఉత్పత్తులకు మార్కెట్ తెరిస్తే, ఏటా మరింత విస్తరించకుండా ఎలా ఆపగలం? భద్రతా చర్యలు ఉంటాయా? లేక ప్రతి ఒప్పందంలో మరిన్ని పంటలను చేర్చుకుంటూ పోతారా?
ఈ ప్రశ్నలకు ప్రధాన మంత్రి స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని రాహుల్ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. ‘ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది. భారత్ వ్యవసాయ రంగంపై మరో దేశం దీర్ఘకాల ప్రభావం ఏర్పరచుకునేలా మనం అనుమతిస్తున్నామా?’ అని ఆయన ప్రశ్నించారు.
Read Also: మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీలో కల్తీ ఆహారం కలకలం
Follow Us On: Sharechat


